అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్
ఇటీవల జరిగిన ‘వీరసింహా రెడ్డి’ విజయోత్సవ సభలో మహా నటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావును కించపరిచేలా ‘అక్కినేని తొక్కినేని..’ అంటూ చిత్ర హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. వీటిపై అక్కినేని అభిమానులు మండి పడుతున్నారు. ఎన్టీఆర్‌తో సమఉజ్జి అయినటువంటి ఓ గొప్ప నటుణ్ణి అకారణంగా దూషించడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్, ఎప్పుడు కూర్చొని వేద శాస్ర్తాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు, ఈ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకునే వాళ్లం’ అని బాలకృష్ణ ఆ సభలో వ్యాఖ్యానించారు. వీటిపై అక్కినేని యువహీరోలు నాగచైతన్య, అఖిల్ స్పందించారు. ‘నందమూరి తారకరామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, ఎస్వీ రంగారావుగారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు, వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడమే’ అంటూ నాగచైతన్య, అఖిల్ ట్వీట్ చేశారు.
అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పాలి
ఈ వివాదంపై ఆల్ ఇండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావు స్పందించారు. ‘గొప్ప నటుల గురించి జోక్‌గా మాట్లాడుకోవడం చాలా తప్పు. నాగార్జున నందమూరి హీరోల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఏఎన్నార్‌ను కించపరచడం అంటే తెలుగు పరిశ్రమను అవమానించినట్లే. అక్కినేని కుటుంబానికి బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.