Naga Babu | బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమం ప్రేక్షకులకి ఎంత వినోదం పంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఈ షో సక్సెస్ ఫుల్‌గానే నడుస్తుంది. అయితే అప్పట్లో ఈ షోకి నాగబాబు, రోజా జడ్జ్‌లుగా ఉన్న విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో నుంచి తప్పుకుని చాలా కాలమే అయింది. ఆయనతో పాటు రోజా కూడా వెళ్లిపోయిన తర్వాత, జబర్దస్త్‌కి పర్మనెంట్ జడ్జిలులేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మేనేజ్మెంట్ తాత్కాలికంగా మనో, ఖుష్బూ లాంటి సెలబ్రిటీలను జడ్జిలుగా పెట్టి షోను నడిపిస్తున్నారు. దీంతో షో పాపులారిటీ కొంత మేర తగ్గిపోయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి.
జబర్దస్త్ టీమ్‌తో నాగబాబుకి విభేదాలు రాగా, ఆయన మరో ఛానెల్‌కి వెళ్లి కొత్తగా కామెడీ షో ప్రారంభించినా, అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన అదే జబర్దస్త్ వేదికపై గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. జబర్దస్త్ షో ప్రారంభమైన 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఓ స్పెషల్ సెలబ్రేషన్ ప్లాన్ చేసింది. దీనికోసం రిలీజ్ చేసిన ప్రోమో ఇప్పటికే వైరల్ అవుతోంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్లో చమ్మక్ చంద్ర, అదిరే అభి లాంటి ప్రముఖ కమెడియన్లు హాజరై సందడి చేయనున్నారు. హైపర్ ఆది, అనసూయలతో పాటు మిగతా పాపులర్ ఆర్టిస్టులు కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు.
నాగబాబు రీఎంట్రీతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆయన రీ ఎంట్రీకి సంబంధించిన ప్రోమోలో ‘ఓజీ’ సినిమాలోని “అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే” అనే డైలాగ్ ప్లే చేస్తూ, జబర్దస్త్ యూనిట్ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో యాంకర్‌గా జబర్దస్త్‌కు వెలుగు తెచ్చిన అనసూయ కూడా ఈ స్పెషల్ ఎపిసోడ్లో కనిపించనున్నారు. చాలా రోజుల తర్వాత అనసూయ, నాగబాబు, ఇతర సీనియర్ కమెడియన్లు ఒకే వేదికపై కనిపించబోతుండటంతో, ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఇప్పటికైతే నాగబాబు షోకు కేవలం గెస్ట్ జడ్జిగా మాత్రమే వచ్చారని సమాచారం. 12 ఇయర్స్ సెలబ్రేషన్ ఎపిసోడ్ కోసం స్పెషల్ అపీరియన్స్ మాత్రమే ఇచ్చారని టాక్. ప్రస్తుతం నాగబాబు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.