Cinema News | గడిచిన క్షణాన్ని లక్షణంగా వినియోగించుకుంటే.. వర్తమానం సలక్షణంగా సాగుతుంది. భవిష్యత్తు విలక్షణంగా ఉంటుంది. ఈ సత్యాన్ని సినిమాకు అన్వయిస్తే.. అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. ఏకకాలంలో ప్రేక్షకుడిని భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో విహరింపజేసే శక్తి సినిమాకు ఉంది. ఇది సాదాసీదా ఫ్లాష్‌బ్యాక్ బాపతు గతం కాదు! కాలంలో ప్రయాణించే కథలు! వీటిలో కొన్ని శతాబ్దాలు వెనక్కి తీసుకెళ్తే… మరికొన్ని భవిష్యత్తుకు మోసుకెళ్తాయి. ఈ తరహా ప్రయోగాలు తెలుగు వెండితెరకు కొత్తేం కాదు. అరుదుగానే అయినా కాలజాలంలో ప్రేక్షకుడిని ఉర్రూతలూగించిన సినిమాల సంగతి ప్రస్తుతం తెలుసుకుందాం..
కాలగతిని ఆధారంగా చేసుకొని నిర్మితమవుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కల్కి 2898ఏడీ’. వైజయంతి మూవీస్‌పై నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కథ కాలానితో ముడిపడి ఉన్నదేనని తెలుస్తున్నది. మహాభారత కాలంలో మొదలై 2898 సంవత్సరంతో ముగుస్తుందట! దాదాపు ఆరువేల సంవత్సరాల కాలంలో జరిగిన పరిణామాలను గుదిగుచ్చి మూడు గంటల నిడివిలో పూసగుచ్చినట్టు ఆవిష్కరించనున్నాడు నాగ్ అశ్విన్. ప్రభాస్‌తోపాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, పశుపతి, రాజేంద్రప్రసాద్ ఇలా లబ్ధప్రతిష్ఠులైన నటీనటులతో విజువల్ ఫీస్ట్ అందించనున్నాడు.
‘కల్కి 2898ఏడీ’ టైమ్ ట్రావెల్ తరహా చిత్రమో, కాదో స్పష్టత లేకపోయినా.. సమయానికి ప్రాధాన్యం ఉన్న సినిమా అని దర్శకుడు స్పష్టం చేశాడు. దీంతో మరోసారి భూత, భవిష్యత్ కాలాల్లో విహరించిన ‘ఆదిత్య 369’ చర్చలు మొదలయ్యాయి. ఈ చిత్రం చర్చల దశలో ఉన్నప్పుడు ఎవరికీ అంతగా అర్థం కాలేదట! టైమ్ మిషన్ ఏమిటో, గతంలోకి ప్రయాణించడం ఏమిటో, భవిష్యత్తులోకి వెళ్లడం ఎందుకో ఇలా సంశయించారట. ఆలోచనల్లో పాతికేండ్లు ముందుండే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్టును అలవోకగా తెరకెక్కించాడు. కాలంలో ప్రయాణించే యంత్రం ఉన్నంత మాత్రాన గతంలో ఎక్కడికి వెళ్తున్నామన్న క్లారిటీ ఉండాలి. ఆ గతానికీ వర్తమానానికీ లింక్ ఉండాలి. ఈ వర్తమానానికీ.. రాబోయే భవిష్యత్తుకూ సంబంధం ఉండాలి. ఇలా త్రికాలాలకూ ఒక వజ్రంతో లింకు పెట్టి.. కాలయంత్రాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకున్నాడు సింగీతం.
రాయల వారి భువన విజయానికి తీసుకెళ్లి తెలుగుదనం గొప్పదనాన్ని పరిచయం చేశాడు. 2500 సంవత్సరానికి తీసుకెళ్లి భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉండబోతుందో హెచ్చరించాడు. 1991లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. లవ్లీ బాయ్‌గా, దేవరాయలుగా బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు. రాజావర్మగా అమ్రిష్పురీ, హేమగా మోహిని, రాయల కొలువులో ఆస్థాన నర్తకి సింహనందినిగా సిల్క్‌స్మిత, తెనాలి రామలింగడి పాత్రలో చంద్రమోహన్, ప్రొఫెసర్‌గా టినూ ఆనంద్ ఇలా నటీనటులంతా తమ అభినయంతో ఆయా పాత్రలను కలకాలం గుర్తుండిపోయేలా చేశారు. దీనికితోడు జంధ్యాల మాటలు, ఇళయరాజా సంగీతం, వేటూరి, సిరివెన్నెల, వెన్నెలకంటి సాహిత్యం, పేకేటి రంగా కళ ‘ఆదిత్య 369’ని కళాఖండంగా మలిచాయి. దీనికి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ చిత్రాన్ని నిర్మించనున్నారన్న వార్తలు తరచూ వినవస్తున్నా… కార్యరూపం ఎప్పుడు దాలుస్తుందో ఆ కాలానికే తెలియాలి.
అక్కినేనివారి మూడు తరాలతో ‘మనం’ సినిమాగా ప్రయోగం చేసి విక్రమ్ మంచి టైమింగ్ ఉన్న డైరెక్టర్ అని నిరూపించుకున్నాడు. కాలానికి అందరూ లొంగాల్సిందే అని ‘మనం’తో చెప్పిన ఆయన కాలాన్ని లొంగదీసుకుంటే ఏమవుతుందో ‘24’లో చూపించాడు. గిర్రున తిరిగే కాలాన్ని ఒక్క పది సెకన్లు ఆపగలిగినా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అదే పాతికేండ్లు వెనక్కి తిప్పితే.. ఓ శాస్త్రవేత్త ఫ్యామిలీ బతికి బయట పడుతుంది, ఓ అభాగ్యురాలి జీవితం బాగుపడుతుంది, ఓ రాక్షసుడి అకృత్యాలకు అడ్డుకట్టపడుతుంది. ఇదే ‘24’ సినిమా కథ. కాలచక్రాన్ని శాసించే గడియారాన్ని తయారు చేసిన ఓ సైంటిస్ట్ కథను యాక్షన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దడంలో విక్రమ్ పరాక్రమించాడనే చెప్పొచ్చు. సెకండ్ల ముల్లుకన్నా వేగంగా నడిచే స్క్రీన్‌ప్లేతో ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు. శాస్త్రవేత్త శివకుమార్‌గా, కథానాయకుడు మణిగా, ప్రతినాయకుడు ఆత్రేయగా సూర్య నటన అందరినీ మెప్పించింది. ఈ చిత్రానికి ప్రీక్వెల్ ఉంటుందని అప్పట్లో ప్రకటించినప్పటికీ… ‘24’ వచ్చి ఎనిమిదేండ్ల కాలం గడిచినా ఇప్పటికైతే ముందుకుసాగలేదు.
కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా దర్శకుడు వశిష్ఠ సృష్టించిన అద్భుతం ‘బింబిసార’. 2022లో వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించిన వసూళ్లు రాబట్టి కాలాన్ని నమ్ముకున్న కథకుడికి విజయం తథ్యమని నిరూపించింది. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దానికి చెందిన బింబిసార చక్రవర్తిని వర్తమాన కాలానికి రప్పించి మెప్పించిన తీరు బాగా కుదిరింది. ఒక అద్దాన్ని కాలయంత్రంగా చూపించడం నమ్మశక్యంగా అనిపించకపోయినా సెంటిమెంట్ ఎలిమెంట్స్ బాగా పండటం ‘బింబిసార’కు బలమైంది. కొత్త దర్శకుడు వశిష్ఠ మేకింగ్, నటీనటుల యాక్టింగ్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్ర పతాక సన్నివేశాల్లో కాలం చేసిన బింబిసారుడు మళ్లీ బతుకుతాడన్న క్లూ వదిలిన దర్శకుడు.. దీనికి సీక్వెల్ ఉంటుందని చెప్పకనే చూపాడు. ‘బింబిసార’ విజయంతో ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో భారీ చిత్రం చేసే అవకాశమూ కొట్టేశాడు. ప్రస్తుతం వశిష్ఠ, చిరంజీవి కాంబినేషన్లో ‘విశ్వంభర’ నిర్మాణ పనులు కాలంతో పోటీగా సాగుతుండటం విశేషం.

విక్రమాదిత్య, బేతాళ కథలు విచిత్రంగా అనిపిస్తాయి. పట్టువదలని విక్రమార్కుడు శ్మశానంలోని చెట్టు దగ్గరికి వెళ్లడం, శవాన్ని భుజానికి ఎత్తుకోవడం, శవంలోని బేతాళుడు విక్రమాదిత్యుడికి కథ చెప్పడం, సందేహం అడగడం, రాజు సమాధానం చెప్పగానే.. శవం సహా మాయమై బేతాళుడు తిరిగి చెట్టెక్కడం.. చందమామ కథల్లో ఆసక్తిగా చదివేవాళ్లం కదా! విక్రమాదిత్యుడికి ఎంత ఓపికో అనుకుంటాం కానీ, కాలజ్ఞానులు దీన్ని టైమ్లూప్గా చెబుతారు. జరిగిందే మళ్లీ మళ్లీ జరుగుతుందన్నమాట. ఆ కారణంగానే విక్రమాదిత్యుడు అన్నిసార్లు పట్టువదలకుండా బేతాళుణ్ని భరించాల్సి వచ్చిందని అంటారు! ఈ ఉపోద్ఘాతమంతా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మానాడు’ సినిమా కోసమే! శింబు, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలుగా వచ్చిన ఈ సినిమాలో సింహభాగం రిపీటెడ్ సీన్లతోనే సాగుతుంది. హీరో పాత్ర చనిపోయిన మరుక్షణం సీను మళ్లీ మొదటికొస్తుంది. ఈ క్రమంలో జరగబోయే ఉపద్రవాన్ని కాకుండా, జరిగిన ఘోరాన్ని ఆపడంలో హీరో ఎలా సక్సెస్ అయ్యాడో చూపించిన తీరు కాస్త తికమకగా అనిపించినా.. అలరిస్తుంది. థియేటర్లో అంతగా ఆడని ఈ డబ్బింగ్ సినిమా.. ఓటీటీలో మాత్రం రికార్డు స్ట్రీమింగ్ సొంతం చేసుకుంది.

ఇప్పటి ‘హనుమాన్’ ఫేమ్ తేజ సజ్జా నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘అద్భుతం’. 2021లో వచ్చిన ఈ సినిమాలో భూత, వర్తమాన కాలాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమకథ నడిపించి శభాష్ అనిపించుకున్నాడు దర్శకుడు మల్లిక్ రామ్. ఒకరు ప్రస్తుత కాలంలో ఉంటే, మరొకరు ఐదారేండ్లు వెనకే ఉండిపోతారు. ఈ ఇద్దరినీ ఫోన్ కలుపుతుంది. చెబుతుంటే గజిబిజిగా ఉన్నా.. ఈ సబ్జెక్ట్‌ను మల్లిక్ డీల్ చేసిన తీరు ప్రేక్షకుల మెప్పు పొందింది. మొత్తంగా ఈ ప్రయోగం ‘అద్భుతం’ అనిపించుకుంది.
కాలాన్ని జయించడం ఎవరి వల్లా సాధ్యం కాదని పెద్దల మాట. దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో 2022లో శర్వానంద్ హీరోగా దర్శకుడు శ్రీ కార్తిక్ తెరకెక్కించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. కాలయంత్రం సాయంతో ముగ్గురు యువకులు గతంలోకి వెళ్తారు. తమ బాల్యాన్ని దగ్గరుండి గమనిస్తారు. ముగ్గురిలో హీరో పాత్ర తన తల్లిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు! చివరికి కాలానిదే పైచేయి అవుతుంది. శర్వానంద్, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ పండించిన హాస్యం ‘ఒకే ఒక జీవితం’ చిత్రానికి హైలైట్. శర్వానంద్ తల్లిగా అమల పెర్ఫార్మెన్స్ అందరికీ నచ్చుతుంది. అయితే, సెంటిమెంట్ మోతాదు ఎక్కువ కావడంతో అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఓటీటీలో మంచి పేరు తెచ్చుకుంది.