యువతపై సినిమా ప్రభావం తప్పకుండా ఉంటుందని, అది కాదనలేని సత్యమని, అందుకే సృజనాత్మక రంగంలో ఉన్నవారు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని చెప్పారు అగ్ర దర్శకుడు నాగ్అశ్విన్. ‘మహానటి’ ‘కల్కి’ చిత్రాలతో ఆయన దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. తాజాగా ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో సినిమా తాలూకు సామాజిక బాధ్యతపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యువత సినిమాల వల్ల ఎంతగానో ప్రభావితమవుతారని, అందుకే తన సినిమాల్లో స్మోకింగ్ సన్నివేశాల్ని సాధ్యమైనంత వరకు లేకుండా చూసుకుంటానని తెలిపారు. ‘నా టీనేజ్ రోజుల్లో హీరోలు స్లోమోషన్లో ైస్టెల్‌గా సిగరెట్ కాల్చే సీన్స్ చూసినప్పుడు చాలా గొప్పగా అనిపించేది. సిగరెట్ తాగడం కరెక్టే అనుకునేవాడిని. కాస్త పరిణితి వచ్చాక వాస్తవం తెలుసుకున్నా. నాలాగే టీనేజర్లు అలాంటి సీన్స్ చూసి ఎఫెక్ట్ అవుతారు’ అని నాగ్అశ్విన్ అన్నారు. తాను దర్శకత్వం వహించిన ‘మహానటి’ సినిమాల్లో చక్రపాణి పాత్ర పోషించిన ప్రకాశ్‌రాజ్ కేవలం ఒక్క సన్నివేశంలో స్మోక్ చేస్తూ కనిపిస్తారని, నిజ జీవితంలో చక్రపాణిగారు చైన్‌స్మోకర్ కావడం వల్ల ఆ సీన్‌ను పెట్టాల్సి వచ్చిందని నాగ్అశ్విన్ వివరించారు. దర్శకుడికి సృజనాత్మక స్వేచ్ఛ అవసరమని, అదే సమయంలో సామాజిక బాధ్యత కూడా అవశ్యమని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. ప్రస్తుతం నాగ్అశ్విన్ ‘కల్కి-2’ సినిమా సన్నాహాల్లో బిజీగా ఉన్నారు.