‘రొటీన్ పాత్రలకు పరిమితమైపోకుండా అన్ని జోనర్లలో సినిమాలు చేయాలనుంది. తెలుగులో అభినయానికి ప్రాధాన్యమున్న మంచి పాత్రలు వరిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది నభానటేష్. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ నెల 17న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నభానటేష్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి…
‘అంధాధూన్’ రీమేక్‌లో నటించే అవకాశం రావడం ఎలా అనిపించింది?
‘అంధాధూన్’ సినిమాను థియేటర్లో చూశా. ఇండియన్ సినిమాకు టర్నింగ్‌పాయింట్‌గా నిలిచింది. కథ, పాత్రల పరంగా భారతీయ సినిమాల ముఖచిత్రాన్ని మార్చింది. ఇలాంటి గొప్ప సినిమా రీమేక్‌లో నటించే అవకాశం రాగానే సంతోషంగా ఫీలయ్యా. కొత్తదనంతో కూడిన ఈ కథాంశాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం కలిగింది.
మాతృకతో పోలికలు వస్తాయనే భయాలు మీలో ఎప్పుడైనా కలిగాయా?
నా కెరీర్లో తొలి రీమేక్ ఇది. నా క్యారెక్టర్‌ను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు? ఒరిజినల్‌తో పోల్చుతారా? లేదా? అనే సందేహాలున్నాయి. హిందీలో రాధికా ఆప్టే నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ స్థాయిలో నేను నటించగలనా అని భయపడ్డాను. రీమేక్‌లో నటించే అవకాశం రాగానే మళ్లీ మాతృకను చూడకూడదని నిర్ణయించుకున్నా. ఒరిజినల్ పాత్ర ప్రభావం లేకుండా నా శైలిలో పాత్రకు న్యాయం చేశాను.
కొవిడ్ జాగ్రత్తల మధ్య షూటింగ్ చేయడం చాలెంజింగ్‌గా అనిపించిందా?
ఈ ఏడాది జనవరిలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆ సమయంలో కొవిడ్ ఉధృతంగా ఉంది. తొలుత హీరో పనిచేసే పబ్ నేపథ్యంలోని సన్నివేశాల్ని చిత్రీకరించాం. ఆ సన్నివేశాల్లో ఎక్కువ మంది జూనియర్ ఆర్ట్టిస్టులు ఉండటంతో చాలా భయపడిపోయాను. షాట్ పూర్తవ్వగానే జనాలందరికీ దూరంగా పారిపోయేదాన్ని(నవ్వుతూ).
థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో సినిమా విడుదలకానుండటం అసంతృప్తికి గురిచేసిందా?
నేను నటించిన గత రెండు సినిమాలు ఓటీటీలోనే విడుదలవుతాయనుకున్నా. కానీ లక్కీగా థియేటర్స్ ద్వారా ప్రేక్షకలు ముందుకొచ్చాయి. కానీ కొవిడ్‌తో పాటు ప్రస్తుతం థియేటర్స్ పరంగా సమస్యలుండటంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదలచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ అయితేనే అందరూ ఈ సినిమా చూడగలుగుతారని నమ్ముతున్నాం.
కమర్షియల్ సినిమాలకే పరిమితమవుతున్నారు?
కమర్షియల్ సినిమాల్లోనూ వైవిధ్యత, ఆసక్తి కలబోసిన పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రతి సినిమాలో కొత్తదనాన్ని కనబరిచే అవకాశం దొరుకుతుంది. రొటీన్ పాత్రలు చేయడం నాకు ఇష్టం ఉండదు. తెలుగులో ఇప్పటివరకు ఐదు సినిమాలు మాత్రమే చేశా. భవిష్యత్తులో తప్పకుండా మహిళాప్రధాన చిత్రాలు, ప్రయోగాత్మక కథాంశ్లాలో నటిస్తా. ప్రస్తుతం కొన్ని సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లను అంగీకరించా. నటిగా నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకోవాలనే లక్ష్యంతో ఉన్నా. సినిమాలో కమర్షియల్ విలువల కంటే కంటెంటే ప్రధానమని నేను నమ్ముతున్నా.
తెలుగు వెర్షన్‌కు సంబంధించి మీ పాత్రలో ఎలాంటి మార్పులు చేశారు?
మాతృకతో పోలిస్తే తెలుగు వెర్షన్లో దర్శకుడు మేర్లపాక గాంధీ చాలా మార్పులు చేశారు. స్ట్రెయిట్ తెలుగు సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. గత చిత్రాలకు భిన్నంగా నా పాత్రచిత్రణ, లుక్ నవ్యరీతిలో ఉంటాయి. అంధుడిగా నితిన్ క్యారెక్టర్ విభిన్నంగా సాగుతుంది. పాత్రలో పరిపూర్ణత కోసం చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ నటించాడు.