N. T. Rama Rao Jr | నేడు నందమూరి నట వారసుడు, యుంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. నేడు తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు ఈ స్టార్ హీరో. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ నటుడు. నందమూరి వంశంలో జన్మించి తాతగారి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నేడు టాలీవుడ్లో తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగారు. అయితే ఎన్టీఆర్ నట ప్రస్థానం చూసుకుంటే..
1983 మే 20న హైదరాబాద్‌లో జన్మించిన తారక్ చిన్న వయసు నుంచే నటనపై ఎక్కువ మక్కువ చూపారు. 1991లో తన తాతగారు దర్శకత్వం వహించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంతో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన జూనియర్. ఆ తర్వాత 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం’ చిత్రంలో రాముడి పాత్రలో నటించి బాల నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఈ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.
2001లో వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్ను చూడాలని’ చిత్రంతో హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్‌కు అదే ఏడాది ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2002లో విడుదలైన ‘ఆది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి ఆయనను మాస్ ప్రేక్షకులకు చేరువ చేసింది.
ఆ తర్వాత ఆయన కెరీర్లో అనేక విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ‘సింహాద్రి’ (2003), ‘యమదొంగ’ (2007), ‘బృందావనం’ (2010), ‘బాద్షా’ (2013), ‘టెంపర్’ (2015), ‘నాన్నకు ప్రేమతో’ (2016), ‘జనతా గ్యారేజ్’ (2016), ‘అరవింద సమేత వీర రాఘవ’ (2018) వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి తన నటనా ప్రతిభను చాటుకున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో తనదైన శైలిని ప్రదర్శిస్తూనే, భావోద్వేగభరితమైన సన్నివేశాల్లోనూ మెప్పించారు.
ఇక 2022లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో ఆయన నటనకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభించాయి. ప్రపంచ వేదికలపై ఆయన నటనకు గుర్తింపు రావడం తెలుగు సినిమాకు గర్వకారణం.
నేడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగారు. తన అద్భుతమైన నటన, డ్యాన్స్ మరియు డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన రాబోయే చిత్రాలైన వార్2, డ్రాగన్ చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.