సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘వారాహి’ సోమవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. జీకే మూవీ మేకర్స్ పతాకంపై రమాదేవి నారగాని నిర్మిస్తున్నారు. వినాయక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ..‘రాక్షస సంహారానికి భగవంతుడు సప్తమాతృకలను సృష్టించాడు. ఆ ఏడుగురు శక్తి స్వరూపాల్లో ఒకరైన వారాహి అమ్మవారి నేపథ్యంలో డివోషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. డిసెంబర్లో రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెడతాం’ అన్నారు. సుమంత్ మాట్లాడుతూ…“సుబ్రహ్మణ్యపురం’ తర్వాత దర్శకుడు సంతోష్ జాగర్లపూడితో నేను చేస్తున్న చిత్రమిది. ఆ సినిమా కంటే చాలా బెటర్ స్క్రిప్ట్ ఇది. ఇటీవల కాంతారా, కార్తికేయ 2 వంటి చిత్రాలు ఇలాంటి కథాంశాలతోనే మంచి విజయాలు సాధించాయి. ఈ క్రమంలో డివోషనల్ థ్రిల్లర్గా మా మూవీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము’ అన్నారు.