Mysa | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’లో బుగ్గారెడ్డి పాత్రతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు తారక్ పొన్నప్ప మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈసారి ఆయన నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’లో ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. తారక్ పొన్నప్ప పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ‘ఈర’ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో తారక్ కనిపించనున్నట్లు ప్రకటించారు. విడుదల చేసిన పోస్టర్లో లుంగీ, నల్లటి చొక్కా ధరించి, చేతిలో పాతకాలపు టెలిఫోన్ పట్టుకుని నిలబడ్డ తారక్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పోస్టర్లో ఫవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తుండగా, బ్యాక్‌డ్రాప్‌లోని కాగడాల వెలుగులు ఈ పాత్ర ఎంత ప్రమాదకరంగా ఉండబోతోందో సూచిస్తున్నాయి.
‘మైసా’లో రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఆమెకు ఎదురుగా నిలిచే ప్రధాన శక్తిగా తారక్ పొన్నప్ప పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది. ‘పుష్ప 2’లో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మికకు ఇబ్బందులు సృష్టించిన బుగ్గారెడ్డి పాత్రలో తారక్ మెప్పించగా, ఇప్పుడు ఆమె సోలో యాక్షన్ డ్రామాలో నేరుగా ప్రతినాయకుడిగా కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. సినీ వర్గాల అభిప్రాయం ప్రకారం, తారక్ పొన్నప్పను ఈ పాత్ర కోసం ఎంపిక చేయడం వెనుక మంచి వ్యూహం కూడా ఉందని చెబుతున్నారు. ‘పుష్ప 2’ ద్వారా ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన, విలన్‌గా ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేసుకున్నారు. అందుకే ‘మైసా’లో ఆయన పాత్రను ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా, మొదటి నుంచే పాత్రకు బలమైన ఇంపాక్ట్ లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
‘పుష్ప 2’లో పరిమిత నిడివి ఉన్నప్పటికీ, తారక్ పొన్నప్ప తన బాడీ లాంగ్వేజ్, హావభావాలు, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన విశేషంగా నిలిచింది. అదే ఇమేజ్ ఇప్పుడు ‘మైసా’కు కూడా అదనపు బలం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ‘మైసా’ ఒక రా అండ్ రస్టిక్ ట్రైబల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. గిరిజన ప్రాంతాల నేపథ్యంలో సాగే ఈ కథలో సంస్కృతి, సంప్రదాయాలు, యాక్షన్ అంశాలు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నట్లు సమాచారం. ఇటీవల ‘కాంతార’, ‘పుష్ప’ వంటి చిత్రాల విజయంతో ఈ తరహా కథలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది.అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రష్మిక మందన్న కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక సోలో ప్రాజెక్ట్‌లలో ఒకటిగా భావిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.