#MeToo | జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. కమిటీ నివేదిక నేపథ్యంలో పలువురు నటీమణులు ఇండస్ట్రీలో ‘మీటూ’పై సంచనల ఆరోపణలు చేశారు. నటుడు జయసూర్య తనను లైంగిక వేధించారని సోనియా మల్హర్ ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు జయసూర్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై జయసూర్య స్పందిస్తూ మల్హర్ తనపై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తాను న్యాయంగా పోరాడుతానన్నారు. నటుడు చేసిన వ్యాఖ్యలకు మల్హర్ కౌంటర్ ఇస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎదురైన, ఎదుర్కొన వేధింపులనే బయటపెట్టానని చెప్పింది. బెదిరింపులకు తాను భయపడబోనని.. వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తాను చేసిన ప్రతి ఆరోపణలోనూ నిజం ఉందన్నారు. తాను జీవితంలో తొలిసారి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడం తొలిసారని చెప్పారు.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక వచ్చాకనే ఓ మీడియాతో మాట్లాడుతూ వేధింపులను బయటపెట్టానని నటి తెలిపారు. ఆ సమయంలోను తాను జయసూర్య పేరును మాత్రం వెల్లడించలేదని.. ఆ తర్వాత విమర్శలు రావడంతో తన గౌరవాన్ని కాపాడుకునేందుకు జయసూర్య పేరు చెప్పానని.. తనతో వ్యవహరించిన తీరును వివరించానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో 17 మంది నటులపై కేసు నమోదైంది. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. నటి మినూ మునీర్ సైతం నటులు ముకేశ్, జయసూర్య, మణియన్ పిల్లరాజు, ఇడవేలు బాబు వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపించింది. బెదిరింపు సందేశాన్ని సైతం స్ర్కీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అయితే, పలువురు నటులు తమపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు.