‘90స్ ఏ మిడిల్‌క్లాస్ బయోపిక్’ వెబ్‌సిరీస్‌తో నటుడిగా తిరిగి వెలుగులోకి వచ్చారు శివాజీ. శుక్రవారం విడుదలైన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ చిత్రంలో ఆయన పోషించిన మంగపతి పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన ఆయన పాత్ర కథలో కీలకంగా నిలిచింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్ జగదీష్ దర్శకత్వంలో వాల్‌పోస్టర్ పతాకంపై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. 12 ఏళ్ల విరామం తర్వాత ‘కోర్ట్’ చిత్రంతో సక్సెస్ఫుల్ సెకండ్ ఇన్సింగ్స్‌కు శ్రీకారం చుట్టానని ఆనందం వ్యక్తం చేశారు శివాజీ. ఆయన మాట్లాడుతూ ‘90స్ వెబ్‌సిరీస్ చేస్తున్న టైమ్‌లోనే నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్‌బాస్ ద్వారా నా నిజమైన వ్యక్తిత్వమేమిటో ప్రపంచానికి తెలిసింది.
90స్ వెబ్‌సిరీస్ తర్వాత దాదాపు ఎనభై కథలు విన్నా. చాలా వరకు ఫాదర్రోల్స్ కావడంతో రిజెక్ట్ చేశా. ‘కోర్ట్’లో పోషించిన మంగపతి క్యారెక్టర్ నా 25 ఏళ్ల కల. దానికి మంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది’ అన్నారు. స్క్రిప్ట్ రాసే సమయంలోనే దర్శకుడు మంగపతి పాత్రలో తనను ఊహించుకున్నాడని, నిజ జీవితం నుంచి స్ఫూర్తి పొంది ఆ పాత్రను సృష్టించాడని, దర్శకుడి విజన్ వల్లే తాను మంగపతి పాత్రకు పూర్తి న్యాయం చేశానని శివాజీ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ రివ్యూలో ‘యానిమల్’లో బాబీ డియోల్ కంటే శివాజీ బాగా చేశాడు’ అని రాశారని, ఆ మాట విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యానని చెప్పారు. ప్రస్తుతం లయతో కలిసి ఓ సినిమా చేస్తున్నానని, ‘దండోరా’ అనే సినిమాలో కూడా నటిస్తున్నానని, 90స్కి సీక్వెల్ కూడా ఉంటుందని శివాజీ వెల్లడించారు.