Orhan Awatramani | బాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ ఓర్హాన్ అవత్రామణి, అలియాస్ ఓరీ (Orry) ఒక భారీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. దాదాపు రూ. 252 కోట్ల విలువైన మాదకద్రవ్యాల కేసు విచారణలో భాగంగా హాజరు కావాలంటూ ముంబై పోలీసులు ఓరీకి సమన్స్ జారీ చేశారు. ముంబై పోలీసులకు చెందిన యాంటీ-నార్కోటిక్స్ సెల్ (ANC) ఘాట్కోపర్ యూనిట్ ఓరీని విచారణ నిమిత్తం పిలిపించింది.
మార్చి 2024లో సంచలనం సృష్టించిన ఈ కేసులో మహారాష్ట్రలోని సాంగ్లీలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో 126.14 కిలోల మెఫెడ్రోన్ (MD) ను పోలీసులు సీజ్ చేశారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ. 252 కోట్లు. ఈ కేసులో ప్రధాన డ్రగ్స్ ట్రాఫికర్ అయిన మహ్మద్ సలీం మొహమ్మద్ సుహైల్ షేక్‌ను దుబాయ్ నుండి అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. విచారణ సందర్భంగా షేక్, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఓరీ పేరును కూడా ప్రస్తావించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే నిందితుడు మహ్మద్ సలీం షేక్ ఇచ్చిన వాంగ్మూలం ఎంతవరకు నిజమనే విషయాన్ని ధృవీకరించడానికి ఓరీని ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ముంబై, దుబాయ్‌లలో షేక్ నిర్వహించిన రేవ్ పార్టీలలో ఓరీ ప్రమేయం ఎంతవరకు ఉందనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. పోలీసు వర్గాలు వెల్లడించిన దాని ప్రకారం, ఈ కేసులో ఓరీపై ఇప్పటివరకు ఎటువంటి చట్టపరమైన అభియోగాలు నమోదు కాలేదు. ప్రస్తుతం ఇది కేవలం దర్యాప్తులో భాగమైన విచారణ ప్రక్రియ మాత్రమే అని అధికారులు స్పష్టం చేశారు. కాగా దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.