ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)కు మరోసారి బెదిరింపు మెసేజ్ వచ్చింది. 5 కోట్లు డిమాండ్ చేశాడో వ్యక్తి. అతన్ని ఓ సాంగ్ రైటర్‌గా గుర్తించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినట్లు ఆ వ్యక్తి తన వార్నింగ్‌లో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని రాయ్‌చూర్‌కు చెందిన సోహెల్ పాషా ఓ గేయ రచయిత. అయితే అతను రాసిన ఓ పాట ఫేమస్ కావాలన్న ఉద్దేశంతో సల్మాన్‌ను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ 7వ తేదీన ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఓ వాట్సాప్ నెంబర్ నుంచి బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి.
తాను బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినట్లు ఆ మెసేజ్‌లో చెప్పాడు. సల్మాన్ 5 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. మై సికందర్ హు అనే సాంగ్‌ను అతను రాశాడు. రాయ్‌చూర్ నుంచి సల్మాన్‌కు మెసేజ్ వచ్చినట్లు ముంబై పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత కర్నాటకకు ఓ బృందాన్ని పంపారు. వెంకటేశ్ నారాయణ్ అనే వ్యక్తి వద్ద ఆ నెంబర్ ఉన్నట్లు గుర్తించారు. కానీ నారాయణ మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదు.
కానీ అతని ఫోన్‌కు వాట్సాప్ ఇన్స్టాలేషన్ ఓటీపీ వచ్చినట్లు పోలీసులు పసికట్టారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి.. నారాయణ ఫోన్ వాడుకుని ఓటీపీ ఆధారంగా వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లు తెలిసింది. రాయ్‌చూర్ సమీపంలో ఉన్న మానావి గ్రామంలోని పాషాను క్రైం బ్రాంచీ పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం పాషాను ముంబైకి తీసుకువచ్చారు. వొర్లీ పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.