Mumaith Khan | ఇప్పటికింకా నా వయసు.. అనే పాటతో ఓ ఊపు ఊపేసిన బోల్డ్ బ్యూటీ ముమైత్ ఖాన్. ఈమె స్పెషల్ సాంగ్స్‌తోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. తన డ్యాన్స్‌తో దుమ్ము లేపిన ముమైత్ ఖాన్ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించి మెప్పించింది. అయితే ఈ అమ్మడు తేజస్వి మదివాడ హోస్ట్ చేస్తున్న ‘ఆహా’ ప్లాట్ ఫామ్ లో ప్రసారం అయ్యే ‘కాకమ్మ కథలు’ అనే టాక్ షోకి హాజరైంది. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి, ముమైత్ ఖాన్ హాజరు కాగా, ఆ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో ముమైత్ ఖాన్ తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది.
ఇంట్లో డ్యాన్స్ వేస్తుంటే కాలు స్లిప్ అయి కింద పడ్డాను. దాంతో బ్రెయిన్ లో నరాలు కట్ అయ్యాయి, సర్జరీ అయింది, 15 రోజులు కోమాలో ఉన్నాను, కొంత మెమరీ లాస్ అయింది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నా బ్రెయిన్ లో 9 వైర్స్ ఉన్నాయి. నా సర్జరీ అయిన మూడు నెలలకి సూపర్ షో చేయడానికి వచ్చాను. పెద్ద సౌండ్ వచ్చినా తట్టుకోలేను. అలాంటిది స్టంట్స్ చేశాను. నెక్స్ట్ డే నేను పొద్దున్నే లేవలేకపోవడంతో అందరు కంగారు పడ్డారు. ఆసుపత్రికి తీసుకెళ్లారు. నా సర్జరీ తర్వాత డాక్టర్స్ ఏడేళ్లు రెస్ట్ తీసుకోమన్నారు. పని చేయొద్దు అన్నారు. నేను పని చేయకపోతే ఎలా బతకాలి అనుకున్నాను, కానీ తప్పలేదు.
మెడిసిన్స్ తీసుకోడం వలన చాలా లావు అయ్యాను, ఫేస్ పాడైపోయింది. ఈ ఫీల్డ్ లో ఫేస్, ఫిట్నెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నా మీద నేను ఫోకస్ చేసి గతంలో ఉన్నట్టు రెడీ అయి బ్యాక్ ఇచ్చాను. ఇప్పుడు ఒక టీవీ షో చేస్తున్నాను. కొత్త బిజినెస్ మొదలుపెట్టాను అంటూ ఏడేళ్లు తాను పడ్డ కష్టాలని వివరించింది. ముమైత్ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లోని ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. నటిగా పలు చిత్రాలతో మెప్పించినా.. ఆమెకు మాత్రం ఐటెమ్ సాంగ్స్ తోనే మంచి క్రేజ్ వచ్చిందని చెప్పాలి. నటిగా, డ్యాన్సర్ గా ఓవైపు ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు ‘జలక్ దిక్లా జా 6’, ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 1’ వంటి తెలుగు రియాలిటీ షోల్లోనూ కనిపించి మెప్పించింది.