Multiplex | ఇటీవల పాపులర్ మల్టీప్లెక్స్ సినిమా ప్రదర్శనకి వచ్చిన వారికి తీవ్ర నిరాశను మిగిల్చినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి ఘటన ఘట్కోపర్లోని ఐనాక్స్ ఆర్-సిటీలో `మిషన్ ఇంపాజిబుల్` షో విషయంలో జరిగింది. మల్టీప్లెక్స్ యాజమాన్యం ప్రేక్షకులకి చిరాకు తెప్పించడంతో వారు విసుగొచ్చి వెళ్లిపోయారట. సినిమా చూసేందుకు 10.30 పీఎం షో కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్న 50 మంది సినీ ప్రేక్షకులు గంటకి పైగా వెయిట్ చేసి చివరికి నిరాశతో వెళ్లిపోయారు. మేటర్లోకి వెళితే ఘట్కోపర్లోని ఐనాక్స్ ఆర్-సిటీ నిర్వాహకులు 10.30కి షో అయితే 11.30 -12 మిడ్ నైట్ వరకూ షో వేయకుండా ప్రేక్షకులు పడిగాపులు కాసేలా చేశారట.
ఐదు నిమిషాలలో షో వేస్తామని చెబుతున్నా కూడా వారు వేయకపోగా గంటన్నర సేపు వెయిట్ చేయించారట. చెప్పిన కారణానికి అక్కడ జరిగిన సన్నివేశానికి పొంతన లేకపోవడంతో ప్రేక్షకులు సీరియస్ అయ్యారు. థియేటర్ లో గంటల కొద్దీ వేచి చూసిన వారిలో వృద్ధులు, పిల్లలతో పాటు తరలి వచ్చిన కుటుంబ సభ్యులు ఉన్నారు. వారంతా అసహనం వ్యక్తం చేశారు. ఫుడ్ కూపన్స్ కోసం పే చేసిన డబ్బుని వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరగా, యాజమాన్యం తలబిరుసు సమాధానం చెప్పారట. బాధ్యతారాహిత్యంగా వారు వ్యవహరించడం చాలా మందికి కోపం తెప్పించిందట.
తలెత్తిన సమస్య గురించి నిజం చెప్పకుండా, అబద్ధాలతో బొంకేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రేక్షకులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. థియేటర్ సభ్యుడు ఒకరు `కెడిఎమ్తో సాంకేతిక సమస్య` అని చెప్పారు. కానీ థియేటర్ లో ప్రొజెక్షన్ ఆపరేటర్ లేరని ప్రేక్షకులు గమనించారు. సినిమా వేసే ముందు ప్రకటనలు వేయలేదు.. సినిమాని కూడా వేయలేదు. ఇంటికి వెళ్లి బుకింగ్ యాప్ల నుండి వాపసు పొందండి అంటూ తలబిరుసు సమాధానం చెప్పారు. విసుగు చెందిన ప్రేక్షకులు ఐనాక్స్ నిర్వాహకులను తిడుతూ, ఇక ఎప్పటికీ ఇలాంటి చెత్త థియేటర్లకు రాకూడదని నిర్ణయించుకున్నారు.