Megastar Chiranjeevi | కాపు సామాజిక వర్గ హక్కుల పోరాట యోధుడు, మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం (73) గారి మృతి పట్ల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారనే వార్త తెలిసిన వెంటనే చిరంజీవి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఎంతో భావోద్వేగంతో స్పందిస్తూ తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్లో, మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం. ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి. అంటూ రాసుకొచ్చారు.