MSG | ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై రీజనల్ ఇండస్ట్రీలో హిట్‌గా నిలిచిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కమర్షియల్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్లింది. కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో మంచి రన్‌ను కొనసాగిస్తోంది.ఇప్పటికే థియేట్రికల్ రన్‌తో సూపర్ సక్సెస్ అందుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. తెలుగు మాత్రమే కాకుండా ఇతర పాన్ ఇండియా భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.సినిమా విషయానికి వస్తే, చిరంజీవి ఎనర్జీ, టైమింగ్, కామెడీ పంచ్‌లతో మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఆయనకు జోడిగా నయనతార హీరోయిన్గా నటించి కీలక పాత్ర పోషించింది. ఇక విక్టరీ వెంకటేష్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించి సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వెంకీ మామ కామియోకు థియేటర్లలో వచ్చిన స్పందన సినిమాకే హైలైట్‌గా మారింది.
భీమ్స్ సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచింది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించగా, సుష్మిత కొణిదెల సమర్పించారు. కమర్షియల్ ఎలిమెంట్స్, కుటుంబ కథ, హాస్యం, భావోద్వేగాలు అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ అనీల్ రావిపూడి ఈ సినిమాను ప్రేక్షకులకు నచ్చేలా మలిచారు.థియేటర్లలో ఇప్పటికే విజయవంతంగా దూసుకెళ్లిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీలోనూ అదే స్థాయి రెస్పాన్స్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఫిబ్రవరి రెండో వారంలో డిజిటల్ రిలీజ్ ఖరారైతే, థియేటర్ మిస్ అయిన ప్రేక్షకులకు ఇది మంచి వినోదంగా మారనుంది.