Mrunal Thakur | ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటు తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ సత్తాచాటుతున్నది. కెరీర్ ఆరంభం నుంచి కథాబలమున్న చిత్రాల్లో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉన్నా..ఆ తరహా సినిమాల్లో డ్యాన్స్‌కు స్కోప్ లేకపోవడంతో తాను బాధపడ్డానని చెప్పింది మృణాల్ ఠాకూర్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘హృతిక్‌రోషన్‌తో ‘సూపర్ 30’లో నటించా. తను మంచి డ్యాన్సర్. అయితే ఆ సినిమా ఎడ్యుకేషన్ నేపథ్య కథాంశం కావడం వల్ల డ్యాన్స్‌కు ఆస్కారం లేకుండా పోయింది.
‘జెర్సీ’ సినిమాలో షాహిద్కపూర్తో కలిసి నటించాను. ఆ సినిమాలో కూడా నృత్యాలకు అంతగా ప్రాధాన్యత లేదు. మంచి డ్యాన్సర్స్ అయిన హీరోల పక్కన డ్యాన్స్ చేసే అవకాశం రాలేదని చాలాసార్లు బాధపడ్డా. అందుకే తెర వెనక డ్యాన్సులు చేస్తూ సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటాను’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీస్టార్’ చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమాలో నృత్యాలకు చాలా ప్రాధాన్యత ఉందని చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్.