మృణాళ్ ఠాకూర్ క్రేజ్ ప్రస్తుతం మామూలుగా లేదు. ‘సీతారామం’ తర్వాత ఆమె కెరీరే మారిపోయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉంది. నానితో ఆమె నటించిన ‘హాయ్ నాన్న’ డిసెంబర్లో రానుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కించే సోషియో ఫాంటసీ సినిమాలో కూడా ఓ హీరోయిన్గా మృణాళ్ సెలక్టయినట్టు విశ్వసనీయ సమాచారం.
ఇదిలావుంటే ఇటీవల మృణాళ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడింది. ‘నా కెరీర్ ఇప్పుడు బావుంది. నేను ఏ తరహా సినిమాలు చేయాలని కోరుకుంటున్నానో అలాంటి సినిమాలే వరిస్తున్నాయి. అంతా ‘సీతారామం’ చలవే. నాకు ఫాంటసీ సినిమాలంటే ఇష్టం. వెబ్ సిరీస్ ‘బాహుబలి బిఫోర్ ది బిగినింగ్’ లో ఇప్పటికే పది ఎపిసోడ్స్ నటించాను.
ఇందులో యువరాణి శివగామిగా నటించా. కానీ ఆ పాత్రను వామికా గబ్బి నటిస్తున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అందులో నిజంలేదు. ఆ సిరీస్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూశా. కానీ విడుదల అవ్వలేదు. విడుదలైతే తప్పకుండా ప్రజాదరణ పొందుతుంది. సినిమాలే చేయాలని రూలేం పెట్టుకోలేదు. కథ నచ్చితే వెబ్ సిరీస్ చెయ్యటానికి కూడా సిద్ధం’ అంటూ చెప్పుకొచ్చింది అందాలతార మృణాళ్ఠాకూర్.