Mrunal Thakur | ‘మరణం అంటే నాకు భయం. ఒకవేళ నేను చనిపోతే నా కుటుంబసభ్యుల పరిస్థితేంటి? అని ఒక్కోసారి ఊహించుకుంటూ ఉంటాను. అప్పుడు తెలియని భయం నన్ను ఆవహిస్తూ ఉంటుంది. ఓ విధంగా ఇది నా మానసిక దౌర్బల్యం’ అంటున్నది అందాలభామ మృణాల్‌ఠాకూర్. ఇటీవల తన వ్యక్తిగత విషయాల గురించి ఇన్‌స్టాలోని అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించింది మృణాళ్.
‘సెలబ్రిటీగా ఉండటం నిజంగానే అదృష్టం. ఈ ప్రపంచం నిన్ను గుర్తు పడుతుందంటే నువ్వు సాధించినట్టే కదా, అలాగే నీ మాటకు సమాజంలో విలువ ఉంటుంది. సమాజాన్ని మార్చే బలం నీకుంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది మృణాళ్ఠాకూర్. మరి సెలబ్రిటీగా ఉండటం వల్ల నష్టాలు? అనడిగితే..
‘కుటుంబంతో ఎక్కువకాలం గడపలేం. ఒక్కోసారి ముఖ్యమైన పరిస్థితుల్లో ఫ్యామిలీకి దూరంగా బతకాల్సొస్తుంది. అసలు ఈ బాధలన్నీ ఎందుకు? చక్కగా ఇరవైల్లోనే పెళ్లాడేసి, ఇద్దరు పిల్లల్ని కనేసి, భర్తతో కలిసి చక్కగా వారానికోసారి రెస్టారెంట్‌కి వెళ్లేసి, హాయిగా తినేస్తూ, జీవితాన్ని సరదాగా గడిపేయొచ్చుకదా.. అని అప్పుడప్పుడు నాకూ అనిపిస్తుంటుంది. మనసు అనేది కోతి అని ఊరకే అనరుకదా..’ అంటూ అందంగా నవ్వేసింది మృణాళ్ఠాకూర్.