అటు బాలీవుడ్‌కీ, ఇటు టాలీవుడ్‌కి సమ ప్రాధాన్యతనిస్తూ లౌక్యంతో ముందుకెళ్తున్నది కథానాయిక మృణాల్ ఠాకూర్. తెలుగులో ‘సీతారామం’లో సీతగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మృణాల్, నాని ‘హాయ్ నాన్న’తో తెలుగులో ద్వితీయ విఘ్నాన్ని సైతం అధిగమించింది. మూడో సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ కాస్త డిజప్పాయింట్ చేసినా.. త్వరలో ‘డెకాయిట్’తో మరోసారి తెలుగులో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నది మృణాల్ ఠాకూర్.
రీసెంట్గా సౌత్‌లో తన సినీ ప్రయాణం గురించి మృణాల్ మాట్లాడుతూ ‘అసలు దక్షిణాది సినిమాల్లో నటించడం అనేది నా ప్రణాళికలో లేదు. నేను సౌత్ సినిమాలు నటిస్తానని అస్సలు అనుకోలేదు కూడా. ఓ విధంగా అది నాకు అనుకోకుండా దొరికిన అదృష్టం.
‘సీతారామం’ తర్వాత నా విషయంలో బాలీవుడ్ దర్శక, నిర్మాతల దృక్కోణం కూడా మారింది. అందుకే తెలుగు సినిమాకు ఎప్పుడూ రుణపడి ఉంటా’ అని తెలిపింది మృణాల్ ఠాకూర్. ఇంకా చెబుతూ ‘వచ్చే ఏడాది ‘డెకాయిట్’తో మరోసారి టాలీవుడ్ తెరపై కనిపించబోతున్నా. ఆడియన్స్‌కి స్వీట్ షాక్ ఇచ్చే సినిమా ఇది. ఓ కొత్త కథను తెరపై చూస్తారు. నా క్యారెక్టర్ మీ ఊహలకు మించి ఉంటుంది’ అని పేర్కొన్నది మృణాల్ ఠాకూర్.