Kantara Makers | సినిమా టికెట్ ధరల విషయంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ‘కాంతార’ సినిమా నిర్మాతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ నేడు విచారణకు రాగా.. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. దీనిపై తదుపరి విచారణ జరిపి తుది తీర్పు వచ్చేవరకూ టికెట్ ధరల పరిమితిని అమలుచేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సినిమా టికెట్ ధరలపై పరిమితిని విధిస్తూ.. కర్ణాటక ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ ధర గరిష్టంగా రూ.200గా మాత్రమే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ‘కాంతార’ సినిమా నిర్మాతలు కోర్టుకెక్కారు. ప్రభుత్వం నిర్ణయించిన కొత్త నిబంధనల వలన కాంతర వంటి పెద్ద బడ్జెట్ సినిమాలతో పాటు, మల్టీప్లెక్స్‌లలో అధిక ధరలు ఉండే సినిమాలను విడుదల చేయడం కష్టమవుతుందని దానివల్ల ఆదాయం తగ్గి మొత్తం సినీ పరిశ్రమపై చెడు ప్రభావం పడుతుందని హోంబలే ఫిల్మ్స్ వాదించింది. దీంతో ఈ కేసు నేడు విచారణకు రాగా.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్డు స్టేను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.