Super Star Krishna | తెలుగు లెజెండరీ యాక్టర్ కృష్ణ భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. నానక్‌రాంగూడలోని విజయకృష్ణ నివాసంలో ఉన్న కృష్ణ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్, వెంకటేశ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, బోయపాటి, నిర్మాత సురేష్‌బాబు, సి.కల్యాణ్, నటుడు అడవి శేష్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సూపర్ స్టార్ కృష్ణ (80) మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఇవాళ సాయంత్రం కృష్ణ భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి రేపు ఉదయం పద్మాలయ స్టూడియోస్‌కు తరలిస్తారు. కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక.. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు తెలిపారు.