పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా రూపొందిన తొలి పాన్ ఇండియా ఫోక్లోర్ మూవీ ‘హరి హర వీరమల్లు’ ఈ నెల 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ విషయంలో వినిపిస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ, చిత్ర బృందం ఈ సినిమా కథకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ని మంగళవారం విడుదల చేసింది. ఈ చిత్ర కథ.. నిజజీవితంలోని ఏ ఒక్క వీరుడి కథ ఆధారంగా తెరకెక్కింది కాదని, సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథ ఇదని ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఈ చిత్ర బాధ్యతలను దర్శకుడు జ్యోతికృష్ణ చేపట్టిన తర్వాత కథలోని స్ఫూర్తినీ, సారాన్నీ అలాగే ఉంచుతూ కథ తీరుతెన్నుల్ని మాత్రం పూర్తిగా మార్చేశారు.
పురాణాల ప్రకారం హరిహర పుత్రుడిగా అయ్యప్పను ఎలాగైతే వర్ణిస్తారో అలాగే ‘హరిహర వీరమల్లు’ పాత్రను కూడా శివ విష్ణువుల ఏకాంశగా దర్శకుడు జ్యోతికృష్ణ మలిచారు. అందులో భాగంగానే విష్ణువాహనం అయిన గరుడపక్షిని సూచించే డేగను ఈ చిత్ర కథలో కీలకం చేశారు. అలాగే కథానాయకుడు వీరమల్లు చేతిలో శివుడ్ని సూచించే ఢమరుకం చేర్చారు. ధర్మసంస్థాపన కోసం అరుదెంచిన శివ విష్ణువుల అవతారంగా ఇందులో ‘హరిహర వీరమల్లు’ కనిపిస్తాడు.’ అని ప్రకటనలో పేర్కొన్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బాబీడియోల్, అనుపమ్‌ఖేర్, సత్యరాజ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సమర్పణ: ఎ.ఎం.రత్నం, నిర్మాత: ఎ.దయాకర్‌రావు, నిర్మాణం: మెగా సూర్య ప్రొడక్షన్స్.