Mohan lal | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్లు అందుకున్న విషయం తెలిసిందే. మార్చిలో ఎల్2 ఎంపురాన్ అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్న నటుడు తాజాగా ‘తుడరుమ్’ చిత్రంతో మరో హిట్‌ని ఖాతాలో వేసుకున్నాడు.
ఏప్రిల్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే రూ. 160 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరింది. ‘తుడరుమ్’ చిత్రంలో మోహన్‌లాల్ సరసన శోభన నటించగా, దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఈ సినిమా పైరసీ బారిన పడటం సినీ పరిశ్రమలో మరోసారి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, కేరళలోని మలప్పురానికి చెందిన ఓ టూరిస్ట్ బస్సులో ‘తుడరుమ్’ సినిమాను అక్రమంగా ప్రదర్శించినట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిత్ర నిర్మాత ఎం.రంజిత్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేరళ మంత్రి సాజిచెరియన్, సరైన ఆధారాలు లభిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.