Mohan Lal | మలయాళీ సూపర్ స్టార్, నటుడు మోహన్‌లాల్ తన తాజా చిత్రం ‘L2 ఎంపురాన్’ సినిమాపై వచ్చిన వివాదంకు సంబంధించి క్షమాపణలు తెలిపాడు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఒక వర్గాన్ని అవమానకరంగా చిత్రీకరించే విధంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో ఈ వివాదంపై ఇప్పటికే సెన్సార్ బోర్డ్ 17 కట్స్ చెప్పగా.. తాజాగా మోహన్‌లాల్ కూడా క్షమాపణలు తెలిపాడు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
‘ఎంపురాన్’ చిత్రంలో కొన్ని రాజకీయ, సామాజిక అంశాలు చోటు చేసుకోవడంతో నాకు ప్రియమైన కొందరిని అవి నొప్పించాయి. ఒక నటుడిగా నా సినిమాలు ఏ రాజకీయ ఉద్యమాన్ని, భావజాలాన్ని లేదా మతాన్ని అవమానించకుండా జాగ్రత్త పడటం నా బాధ్యతగా భావిస్తాను. అందుకే నేను మరియు మా చిత్ర బృందం తరఫున క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఆ వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుంచి తీసివేయాలని మేము సమిష్టిగా నిర్ణయించాము. గత నాలుగు దశాబ్దాలుగా మీలో ఒకడిగా జీవిస్తూ వచ్చాను. మీ ప్రేమ, విశ్వాసమే నా శక్తి అంటూ మోహన్ లాల్ రాసుకోచ్చాడు.
మోహన్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్ (L2 Empuraan). ఈ సినిమాకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించాడు. మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas), ప్రధాన పాత్రల్లో నటించారు. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ (Lucifer) సినిమాకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మలయాళ సినమాలోనే ఆల్‌టైం కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.