Nani | ఇటీవలే ‘హిట్ 3’తో ఘన విజయం సాధించి, తనదైన శైలిలో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు మరో మాస్ అండ్ ఇంటెన్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ చిత్రం రూపొందుతుంది.. 2023లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ భారీ హిట్ సాధించడంతో, ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో నాని ‘జడల్’ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో నాని రగ్డ్ అండ్ రా అవతారంలో కనిపించి అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో 30 ఎకరాల విస్తీర్ణంలో వేసిన భారీ స్లమ్ సెట్లో షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఈ చిత్రంలో విలన్‌గా డైలాగ్ కింగ్ మోహన్‌బాబు నటిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజాగా, తన ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రెస్మీట్లో పాల్గొన్న మంచు లక్ష్మి, తన తండ్రి మోహన్‌బాబు ‘ది ప్యారడైజ్’లో కీలక పాత్రలో నటిస్తున్నారని చెప్పేసింది. ఈ విషయం బయటకు వచ్చిందో లేదో తెలియదు కానీ చెప్పేస్తున్నా. ‘ది ప్యారడైజ్’లో నాన్న గారు నటిస్తున్నారు. ఈ వయసులోనూ ఆయన ఇంత కష్టపడడం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. తన తొలి సినిమాలా భావించి ఆ పాత్ర కోసం ఎంతో డెడికేషన్ చూపిస్తున్నారు అని మంచు లక్ష్మీ పేర్కొంది.
ఇక మోహన్‌బాబు పాత్రతో పాటు మరో పెద్ద అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యామియోలో కనిపించనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ స్లమ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కీలక సన్నివేశంలో చిరంజీవిని చూపించాలనే ఆలోచనతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కథ రాసుకోగా, అది ఇటీవల చిరంజీవిని కలిసి వినిపించగా, ఆయన వెంటనే ఓకే చేసినట్టు సమాచారం. త్వరలోనే ఆయన సెట్స్ లోకి అడుగుపెట్టనున్నట్లు టాక్. అయితే ఇప్పటికీ మేకర్స్ మాత్రం ఈ విషయం పై అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే ఓదెల – చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుండటంతో ఈ మల్టీస్టారర్ స్పెషాలిటీపై ఆసక్తి మరింత పెరిగింది.