Mohan Babu | విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల వయోభారం కారణంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. అప్పటి, ఇప్పటి హీరోలతో కలిసి పని చేసిన కోట శ్రీనివాసరావు మరణం సినీ పరిశ్రమని విషాదంలో ముంచెత్తింది.ఇక కోట మృతి చెందిన సమయంలో చాలా మంది ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అయితే ఆ రోజు మోహన్ బాబు రాలేదు. ఈ సందర్భంగా సోమవారం కోట కుటుంబాన్ని పరామర్శించారు మంచు మోహన్ బాబు. ఈ సందర్భంగా ఆయన కోటతో తన సన్నిహిత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
‘కోట శ్రీనివాసరావు మా కుటుంబానికి అత్యంత ఆప్తులు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా, మా కుటుంబానికి, అలాగే తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటు అని మోహన్ బాబు ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆయన మరణించిన రోజు తాను హైదరాబాద్‌లో లేకపోవడం బాధాకరమని, ఆ వార్త తనను ఎంతో కలచివేసిందని చెప్పారు. 1987లో ‘వీరప్రతాప్’ సినిమాలో మాంత్రికుడిగా కోట గారికి అవకాశం ఇచ్చాం. మా బ్యానర్‌తో పాటు అనేక ఇతర చిత్రాల్లో కూడా కలిసి పని చేశాం. ఆయనలో ఉన్న నటనా నైపుణ్యం అపారమైనది. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ విన్నవాళ్లకు మర్చిపోలేనిది అని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ధైర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మోహన్ బాబు తెలిపారు. కోట శ్రీనివాసరావు లేని లోటు తీర్చలేనిది. ఆయన నటన, సంభాషణల శైలి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని మోహన్ బాబు భావోద్వేగంగా మాట్లాడారు. ఇక మోహన్ బాబు నిర్మాణంలో ఇటీవల కన్నప్ప అనే చిత్రం విడుదల కాగా, ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇందుకు కన్నప్పగా మంచు విష్ణు నటించిన విషయం తెలిసిందే.