Mogali Rekulu fame Pavitranath | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ బుల్లితెర నటుడు మొగలిరేకులు సీరియల్ ఫేమ్ పవిత్రనాథ్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ పవిత్రనాథ్ మృతి చెందినట్లు చక్రవాకం నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
”మా జీవితంలో నీవు చాలా ముఖ్యమైన వాడివి. నీ మరణ వార్త విన్న తర్వాత… అది నిజం కాకూడదని కోరుకున్నా. అది అబద్ధం అయితే బాగుంటుందని అనుకున్నాను. కానీ, నీవు నిజంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేపోయాం. నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ కుటుంబానికి దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలి” అంటూ మేఘన సోషల్ మీడియాలో రాసుకోచ్చింది.
చక్రవాకం సీరియల్తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు పవిత్రనాథ్.. తర్వాత మొగలిరేకులు సీరియల్లో ఇంద్ర తమ్ముడిగా దయ అనే అమాయకుడు పాత్రలో నటించాడు. ఇక ఈ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆ సీరియల్ చివర్లో అతని పాత్ర బాంబ్ బ్లాస్ట్ లో చనిపోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక పవిత్రనాథ్ మరణ వార్తతో ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. పవిత్రనాథ్ మృతి పట్ల పలువురు బుల్లితెర ప్రముఖులు సోషల్ మీడియా, ఇతర వేదికల ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.