Heroine | ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రికత్త పరిస్థితుల వేళ ఏపీకి చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న మురళీ నాయక్ దేశం కోసం పోరాడి అమరుడయ్యాడు.. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కళ్లి తాండ గ్రామానికి చెందిన మురళీ నాయక్ సైనికుడిగా దేశానికి సేవ చేయాలని 2022లోఅగ్నివీర్ గా సైన్యంలో చేరాడు. ఎంతో భవిష్యత్ ఉన్న అతను శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు మురళీ. ఈ విషాదం నుంచి అతని కుటుంబం ఇప్పటికీ తేరుకోలేకపోతుంది.
పలువురు ప్రముఖులు మురళీ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. ఇలా ఎంతోమంది నేతలు మురళీ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. తాజాగా హీరోయిన్ మిత్రా శర్మ.. మురళీ నాయక్ ఇంటికి వెళ్లి పరామర్శించి తన వంతు సాయం చేసింది. కళ్లితాండలో ఉన్న మురళీ తల్లిదండ్రులని కలిసి వారికి ధైర్యం చెప్పింది. ఒక గొప్ప వీరుడ్ని దేశం కోల్పోయిందని.. ఇలాంటి వీరుడి కుటుంబానికి దేశమంతా ఎప్పటికీ అండగా ఉంటుందని మిత్రా శర్మ పేర్కొంది. మురళీ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేసింది.
అలానే మురళీ సమాధి దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించింది మిత్రా శర్మ. ఇందుకు సంబందించిన వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మనం గొప్ప వీరుడ్ని కోల్పోయాం అంటూ మిత్రా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటి వరకు సినీ సెలబ్రిటీలు ఎవరు కూడా మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించలేదని, మిత్రా శర్మది చాలా గొప్ప మనసు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మిత్రా శర్మ సినిమాలతో పాటు బిగ్బాస్ షో ద్వారా కూడా మంచి గుర్తింపు సాధించింది. ఇక ఇటీవలే మిత్రా చేసిన కొత్త చిత్రం వర్జిన్ బాయ్స్ టీజర్ కూడా రిలీజైంది. ఈ సినిమాలో శ్రీహాన్ లీడ్ రోల్ చేశాడు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ అమ్మడు యూట్యూబర్ హర్షసాయిపై పలు విమర్శలు చేస్తూ వార్తలలో నిలిచింది.