సినిమా పేరు: మిత్రమండలి
తారాగణం: ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం, రాగ్ మయూర్, విష్ణు ఓయి, ప్రసాద్ బెహరా..
దర్శకత్వం: విజయేందర్
నిర్మాతలు: కల్యాణ్ మంతెన, భానుప్రతాప, డా.విజేందర్‌రెడ్డి తీగల
సమర్పణ: బన్నీవాస్
విడుదలకు ముందే ప్రచారం మూలంగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘జాతిరత్నాలు’ స్థాయిలో నవ్విస్తారనే నమ్మకం జనాలకు కుదిరింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా? చూద్దామా.. అని ఆడియన్స్ కూడా బాగానే ఎదురు చూశారు. పైగా నవ్వించడానికే అన్నట్టు సినిమా అంతా హాస్యనటులతో నింపేయడంతో కాస్త నవ్వుకోవడానికి ‘మిత్రమండలి’ (Mithra Mandali) కరెక్ట్ అని అంతా ఫిక్సయిపోయారు. ఇన్‌స్టా వీడియోల ద్వారా పాపులర్ అయిన నీహారిక ఈ సినిమాలో హీరోయిన్గా పరిచయం అవుతుండటం కూడా ఓ విధమైన ఆసక్తికి కారణం అయ్యింది. మొత్తంగా గురువారం ‘మిత్రమండలి’ (Mithra Mandali Review) థియేటర్లలోకి అడుగుపెట్టారు. మరి అందరి అంచనాలనూ నిజం చేశారా? లేదా? తెలుసుకునేముందు.. ముందు కథలోకి వెళ్దాం..
కథ
నారాయణ ఆ ఊరి పెద్దమనిషి (వీటీ గణేశ్). తనకు అణువణువునా కులగజ్జే. కులాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే అవుదామనుకుంటాడు. ఇంతలో అతనికి అనుకోని షాక్ ఎదురవుతుంది. తన కూతురు స్వేచ్ఛ (నిహారిక) వేరెవర్నో ప్రేమించి, ఇంట్లో నుంచి చెప్పకుండా పారిపోతుంది. ఈ విషయం బయట పొక్కితే తన కులం తనను వెలి వేస్తుందనే భయంతో ఆ ఊరి ఎస్ఐ సాగర్ (వెన్నెల కిశోర్)ని కలిసి సీక్రెట్‌గా తన కూతుర్ని వెతకమని ప్రాధేయపడతాడు. తన కూతుర్ని ఎలాగైనా తీసుకొచ్చి తన పరువు కామడని వేడుకుంటాడు. ఇంతలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ (సత్య) ఎంటరవుతాడు. అతని ద్వారా తన కూతురు మాయం కావడానికి ఓ నలుగురు కుర్రాళ్లు (ప్రియదర్శి, రాగ్‌మయూర్, విష్ణు ఓయి, ప్రసాద్ బెహరా) కారణం అని తెలుస్తుంది. ఆ నలుగురూ ఆ ఊళ్లో పనీపాటా లేని ఆవారా బ్యాచ్. అసలు స్వేచ్ఛకూ ఈ అవారా బ్యాచ్‌కూ గల సంబంధం ఏంటి? స్వేచ్ఛ కిడ్నాప్‌కి గురైందా? లేక లేచిపోయిందా? సాగర్ వీళ్లను పట్టుకున్నాడా? లేదా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ
విశ్లేషణ
కేవలం నవ్వించడానికే తీసిన సినిమా ఇది. అయితే.. నవ్వించడం తేలికైన విషయం కాదు. ఏమాత్రం డోసు ఎక్కువైనా హాస్య కాస్తా అపహాస్యమై కూర్చుంటుంది. డోసు తగ్గితే.. ప్రయత్నం కాస్తా వృధా అవుతుంది. కామెడీ అంటే.. కొలత ప్రకారం ఉండాలి. అది అందరికీ సాధ్యం కాదు. దర్శకుడు విజయేందర్ ఈ విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కథలో ఎక్కడా లాజిక్ అనేదే కనిపించదు. అందరూ నవ్వించడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయాత్నాల్లో కొన్ని సక్సెస్ అయ్యాయి. కొన్ని మిస్ ఫైరయ్యాయి. కథలో కామెడీ ఉంటే సినిమా ఎక్కువ కాలం జనాల హృదయాల్లో నిలుస్తుంది. ఈ సినిమా కథ విషయంలో డైరెక్టర్ ఇంకాస్త శ్రద్ధ పెడితే బావుండేది. ఇందులో నటించిన నటులంతా నవ్వించడంలో ఆరితేరినవారే. వారంతా తమ పని తాము చేసుకుపోయారు. అందరూ కష్టపడ్డారు. నవ్వించడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా ‘ఇంపార్టెంట్ క్యారెక్టర్’ అంటూ వచ్చిన సత్య కామెడీ సినిమాకు హైలైట్.
నటీనటులు
ప్రియదర్శి, రాగ్‌మయూర్, విష్ణు ఓయి, ప్రసాద్ బెహరా అందరూ ఎప్పటిలాగే తమ పాత్రలకు న్యాయం చేశారు. తమదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. అయితే.. ప్రతి విషయాన్నీ అందరూ అరిచి చెప్పడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక వెన్నెల కిశోర్, సత్య, వీటీ గణేశ్ అందరూ కూడా ఎప్పటిలాగా తన పాత్రలకు న్యాయం చేశారు. ఇక నిహారిక ఎన్ఎం కథానాయికగా ఆకట్టుకున్నది. అభినయంతోపాటు అందంతో కూడా మెప్పించింది.
సాంకేతికంగా..
దర్శకుడు కథ, కథనాల విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బావుండేది. అయితే.. ఉన్నంతలో జోష్‌గా కథను నడిపించాడు. అంతమంది నటులతో పనిచేయించుకోవడం కూడా అభినందించదగ్గ విషయమే. ధ్రువన్ సంగీతం బావుంది. పాటలు వినడానికీ, చూడ్డానికీ కూడా బావున్నాయి. నేపథ్య సంగీతం కథనానికి తగ్గట్టుగా ఉంది. ఛాయాగ్రహణం చెప్పుకోదగ్గంత గొప్పగా లేదు. ఎడిటర్‌కు ఇంకాస్త పని ఉందని అనిపిస్తుంది.
మొత్తంగా కామెడీ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ‘మిత్రమండలి’ నచ్చొచ్చు.
బలాలు
ద్వితీయార్ధం కొన్ని సన్నివేశాలు, సత్య కామెడీ
బలహీనతలు
కథ, అంతగా మెప్పించలేని హాస్యం
రేటింగ్ 2.75/5