Mission Santa | భారతీయ యానిమేషన్ రంగానికి గర్వకారణంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన భారీ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం ‘మిషన్ సాంటా’ ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ‘నరసింహ అవతార్’ యానిమేషన్ చిత్రానికి లభించిన విశేష ఆదరణ నేపథ్యంలో, ఇప్పుడు ‘మిషన్ సాంటా’ సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది. భారత్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రం, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని థియేటర్లలో కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది.
అత్యున్నత స్థాయి యానిమేషన్ క్వాలిటీతో, స్పీడ్ గ్రిప్పింగ్ కథనం, థ్రిల్లింగ్ అడ్వెంచర్స్ మరియు హృదయాలను తాకే ఎమోషన్స్‌తో కూడిన హై ఎనర్జీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీనిని తీర్చిదిద్దారు. ముఖ్యంగా చిన్నారుల నుంచి పెద్దల వరకు కుటుంబ సమేతంగా వెండితెరపై చూసి ఆనందించేలా ఉన్న ఈ చిత్రం భారతీయ యానిమేషన్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. లాస్ ఏంజిల్స్‌లో కథ, స్క్రిప్ట్ మరియు పాత్రల డిజైనింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, భారతీయ సీనియర్ యానిమేషన్ నిపుణుల పర్యవేక్షణలో సుమారు 20 నెలల పాటు 150 మందికి పైగా కళాకారుల శ్రమతో ప్రొడక్షన్ పూర్తి చేసుకుంది. బ్రాడ్‌విజన్ ఇండియా మరియు స్టూడియో 56 సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, భారతీయ యానిమేషన్ సత్తాను ప్రపంచ స్థాయికి చాటిచెప్పే లక్ష్యంతో రూపొందించబడింది. ఇంగ్లీష్ భాషలో విడుదలవుతున్న ‘మిషన్ సాంటా’ ప్రేక్షకులకు ఒక ప్రీమియం యానిమేటెడ్ థియేట్రికల్ అనుభవాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తోంది.