‘శ్రీరాములవారి నేపథ్యం.. అశోకుని కాలం నాటి తొమ్మిది పుస్తకాల బ్యాక్‌డ్రాప్.. ఇతిహాసాల కోణం.. ఇలా ఈ కథలో ఊహించని అంశాలుంటాయి. ఇందులో నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. లేజీగా ఉండేవాడు బతకడానికి అనర్హుడు అని భావించే పాత్ర. దర్శకుడు కార్తీక్ నా పాత్రను బాగా డిజైన్ చేశారు.’ అన్నారు మంచు మనోజ్. ఆయన విలన్‌గా, తేజ సజ్జా సూపర్ యోధగా నటించిన పాన్ ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది.
ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో మంచు మనోజ్ విలేకరులతో మాట్లాడారు. ‘నాకు డైరెక్టర్ కార్తీక్ ఎప్పట్నుంచో తెలుసు. ఇక తేజ సజ్జా అయితే.. చిన్నప్పట్నుంచీ తెలుసు. తను ఒక ఈవెంట్లో కలిసినప్పుడు ‘మంచి స్క్రిప్ట్ వుంటే కలిసి చేద్దాం తమ్ముడు..’ అని చెప్పాను. ‘నిజమా అన్నా..’ అన్నాడు. ఓ రోజు సడెన్‌గా వచ్చి ‘మిరాయ్’ గురించి చెప్పాడు. తర్వాత కార్తీక్ కథ వినిపించారు. అద్భుతమైన కథ. ఇందులో నా పాత్ర మోడరన్ రావణ అనుకోవచ్చు.
అయితే.. ఆడవాళ్ల జోలికి మాత్రం వెళ్లడు.’ అని తెలిపారు మనోజ్. ఈ సినిమా క్రెడిట్ మొత్తం డైరెక్టర్‌దే. చాలా డీటెయిల్డ్‌గా తీశాడు. రజనీకాంత్‌గారికి ఈ కథ చాలా బాగా నచ్చింది. ఇందులోని పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. చిన్నప్పుడు నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ కూడా ఉపయోగపడింది. తేజా కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు. టెక్నీషియన్సంతా ప్రాణం పెట్టి పనిచేశారు. నిర్మాత విశ్వప్రసాద్ ఎక్కడా రాజీపడలేదు. నిర్మాణ విలువలు భారీగా ఉంటాయి. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి, రక్షక్ సినిమాల్లో నటిస్తున్నా.’ అని మంచు మనోజ్ తెలిపారు.