Mirai |యంగ్ హీరో తేజ సజ్జా ‘మిరాయ్’ తో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఫాంటసీ డ్రామా జానర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సాధించింది. తాజాగా ఈ సినిమా నార్త్ అమెరికాలో $3 మిలియన్ గ్రాస్ మార్క్ చేరువలో ఉందని సమాచారం. శనివారం ఒక్క రోజులోనే అమెరికా, కెనడా కలిపి ఈ సినిమా $55,000 డాలర్లు వసూలు చేయడం గమనార్హం. ఇప్పటివరకు అక్కడ మొత్తం $2.98 మిలియన్ గ్రాస్ రాబట్టిన మిరాయ్, సోమవారం నాటికి $3 మిలియన్ క్లబ్లో చేరుతుందన్న అంచనాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ విజయంతో తేజ సజ్జా, టాలీవుడ్ లో ప్రభాస్, ఎన్టీఆర్ల తర్వాత వరుసగా రెండు సినిమాలతో $3 మిలియన్ మార్క్ అందుకున్న మూడో హీరోగా ఘనత సాధించనున్నాడు.
చిన్న హీరోగా పరిచయమైన తేజ సజ్జా ఇప్పుడు స్టార్ హీరోల సరసన నిలవడం గమనార్హం. మిరాయ్ సినిమాతో అతని క్రేజ్ మరో స్థాయికి చేరిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా మిరాయ్ వసూళ్ల పరంగా శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ₹150 కోట్ల దిశగా వసూళ్లు సాధించడం, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందడం విశేషం. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్, ఋతికా నాయక్, శ్రియా శరన్, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, థ్రిల్లింగ్ స్క్రీన్ప్లే, ఎమోషనల్ కంటెంట్ సినిమాకు హైలైట్గా నిలిచాయి.
ఈ విజయంతో తేజ సజ్జా తదుపరి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ చిన్న హీరోగా ప్రారంభమై, పాన్ ఇండియా విజయం సాధించడం తేజ సత్తా ఏంటో తెలియజేస్తుంది. రానున్న రోజులలో ‘మిరాయ్’ ఇంకా ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో చూడాల్సిందే. త్వరలో మిరాయ్ 2 కూడా మొదలు కానుందని తెలుస్తుండగా, ఈ సినిమాని భారీ బడ్జెట్తో రూపొందించనున్నట్టు టాక్.