‘ధర్మపురి ప్రాంత గ్రామీణ వాతావరణాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించారు. గోదావరి తీరాన పురాతనమైనటువంటి ధర్మపురి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఆ గుడి పేరుతో సినిమా రావడం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్.
బుధవారం జరిగిన ‘1996 ధర్మపురి’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గగన్ విహారి, అపర్ణదేవి జంటగా నటించిన ఈ చిత్రానికి జగత్ దర్శకత్వం వహించారు. భాస్కర్ యాదవ్ దాసరి నిర్మాత. నేడు విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘యథార్థ సంఘటనలతో ఈ సినిమాను రూపొందించాం. ధర్మపురిలోని ఓ గడిలో పనిచేసే జీతగాడు, బీడీలు చుట్టే అమ్మాయి మధ్య కథ నడుస్తుంది. ప్రతి సన్నివేశం వాస్తవికతను ప్రతిబింబిస్తుంది’ అన్నారు. పల్లెటూరి ప్రేమకథగా ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు.
చిన్న పాత్రలు వేసే తనకు ఈ సినిమా హీరోగా మంచి బ్రేక్నిస్తుందనే విశ్వాసముందని గగన్ అన్నారు. తెలుగులో తనకిది తొలి చిత్రమని..నాగమల్లి అనే పాత్రలో కనిపిస్తానని కథానాయిక అపర్ణ చెప్పింది. ఈ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్, దర్శకుడు మారుతి, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.