Actor | ఇటీవల చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. ఒకరి మృతిని మరిచిపోక ముందే మరొకరు కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కోట శ్రీనివాసరావు,సరోజా దేవి, ఫిష్ వెంకట్ వంటి ప్రముఖులని ఇటీవల కోల్పోయాం. ఇక ఆ విషాదకర వార్తలు మరిచిపోక ముందే మలయాళ చిత్రసీమలో విషాదం అలుముకుంది. ప్రముఖ నటుడు, మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్ (51) శుక్రవారం సాయంత్రం కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
నవాస్ ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం అక్కడ బసచేస్తుండగా, నిర్ణీత సమయానికి చెక్ఔట్ చేయకపోవడంతో హోటల్ సిబ్బంది అతని గదికి వెళ్లారు. అతన్ని అపస్మారక స్థితిలో చూసి తక్షణమే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నవాస్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, గుండెపోటు కారణంగా మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. అతని గదిలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని తెలిపారు. మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుసుకోవడానికి శనివారం కలమస్సేరి ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్ట్మార్టం నిర్వహించనున్నారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
కళాభవన్ నవాస్ మిమిక్రీ కళాకారుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, నటుడిగా, నేపథ్య గాయకుడిగా సౌతిండియా సినిమా అభిమానుల మన్ననలు పొందారు. ఆయన 1995లో ‘చైతన్యం’ అనే చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు.మిమిక్స్ యాక్షన్ 500 (1995), హిట్లర్ బ్రదర్స్ (1997), జూనియర్ మాండ్రేక్ (1997), ,మట్టుపెట్టి మచాన్, అమ్మ అమ్మయ్యమ్మ (1998), ,చందమామ (1999), థిల్లానా తిల్లానా (2003) వంటి చిత్రాలతో మెప్పించారు. అలాగే కామెడీ మాస్టర్స్, కామెడీ స్టార్స్ సీజన్ 2, థకర్ప్పన్ కామెడీ వంటి పాపులర్ టీవీ రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మంచి గాయకుడిగా కూడా పేరు సంపాదించారు.కళాభవన్ మృతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మలయాళ చిత్రసీమలో ఓ కీలక పాత్ర పోషించిన వ్యక్తి కోల్పోవడం బాధాకరమని అన్నారు. ప్రస్తుతం నవాస్ మృతదేహాన్ని చొట్టనిక్కరలోని SD టాటా ఆసుపత్రిలో ఉంచారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటు అని ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని పలువురు ప్రార్ధిస్తున్నారు.