అహ్మదాబాద్ : షారుక్ ఖాన్, దీపికా పదుకొనే ప్రధాన తారాగణంగా తెరకెక్కిన పఠాన్ మూవీని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. దీపికా పదుకొనే ఈ సినిమాలోని ఓ పాటలో కనిపించిన తీరు, ఆమె ధరించిన దుస్తుల రంగుపై హిందూ సంస్ధలు విరుచుకుపడుతుండగా తాజాగా అహ్మదాబాద్‌లోని షాపింగ్ మాల్లో బజరంగ్ దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు పఠాన్ పోస్టర్లను చించివేశారు.
వస్త్రపూర్ మాల్లో పఠాన్ విడుదలకు వ్యతిరేకంగా వారు నిరసనలు చేపట్టారు. మాల్లో వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తల వీరంగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిరసనకారులు జైశ్రీరాం అంటూ పఠాన్ మూవీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
పోస్టర్లు, మూవీ ప్రచార సామాగ్రిని ధ్వంసం చేశారు. గుజరాత్లో పఠాన్ మూవీ ప్రదర్శనను అనుమతించబోమని వీహెచ్‌పీ ప్రతినిధి హితేంద్రసింగ్ రాజ్పుట్ పేర్కొన్నారు. ఈ సినిమాను మల్టిఫ్లెక్స్‌లు, థియేటర్లలో ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని థియేటర్ల యజమానులను ఆయన హెచ్చరించారు.