నరేష్ అగస్త్య నటిస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. విపిన్ దర్శకత్వంలో ఉమాదేవి కోట నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ లాంచ్ చేశారు. ఓ సంగీతకారుడి చుట్టూ ఈ కథ తిరుగుతుందని టీజర్ చెబుతున్నది. అతను ఓ ఆల్బమ్ తయారు చేసేందుకు.. స్ఫూర్తికోసం ఓ ప్రశాంతమైన పర్వతప్రాంతానికి వెళతాడు. అక్కడ అతనికి ఓ అమ్మాయి తారసపడుతుంది. ఈ ఇద్దరి ప్రయాణమే సినిమా కథ అని టీజర్ చూస్తే తెలుస్తున్నది.
ప్రయోగాత్మక సంగీత భరిత ప్రేమకథ ఇదని, ఓ క్లీన్ ఎంటైర్టెనర్ చూసిన అనుభూతిని ఈ సినిమా ఇస్తుందని దర్శకుడు చెప్పారు. కె.విశ్వనాథ్‌గారి తరహాలో కళాత్మకచిత్రాలు చేయాలని తలంపుతో ఈ సంస్థ స్థాపించానని, కనీసం కళలు కనెక్ట్ అయ్యేలా ఒక అయిదు సినిమాలైనా నిర్మించాలనేది నా ఆశయమని నిర్మాత ఉమాదేవి తెలిపారు. రబియా ఖాతూన్, రాధిక శరత్‌కుమార్, తనికెళ్ల భరణి, వెంకటేష్ కాకుమాను, విద్యుల్లేఖ, సుమన్, ఆమని, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మోహనకృష్ణ, సంగీతం: జస్టిస్ ప్రభాకరన్, కళ: తోట తరణి, నిర్మాణం: సునేత్ర ఎంటైర్టెన్మెంట్ ప్రై.లిమిటెడ్.