చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
వరుస విజయాలతో దూసుకెళ్తోంది. చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బెంగళూరు 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 205 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు బౌలర్ల ధాటికి కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేసింది.
కోల్‌కతా టీమ్‌లో అండ్రూ రస్సెల్(31: 20 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) టాప్ స్కోరర్. ఏ ఒక్క బ్యాట్స్‌మన్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. నితీశ్ రాణా(18), శుభ్‌మన్ గిల్(21), రాహుల్ త్రిపాఠి(25), ఇయాన్ మోర్గాన్(29), దినేశ్ కార్తీక్(2), షకీబ్ అల్ హసన్(26) అంతంతమాత్రంగానే రాణించారు. బెంగళూరు బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ కోల్‌కతాను లక్ష్యం దిశగా సాగనివ్వలేదు. మోర్గాన్, షకీబ్ ద్వయం క్రీజులో నిలబడినా ధాటిగా ఆడలేదు. ఆర్సీబీ బౌలర్లలో జేమీసన్ మూడు వికెట్లతో విజృంభించగా హర్షల్ పటేల్, చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. గ్లెన్ మాక్స్వెల్(78: 49 బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు) విధ్వంసానికి తోడు చివర్లో ఏబీ డివిలియర్స్(76 నాటౌట్: 34 బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు ) అద్భుత అర్ధశతకంతో రాణించడంతో 20 ఓవర్లలో బెంగళూరు 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. మాక్స్వెల్, డివిలియర్స్ దూకుడును ఏ బౌలరూ అడ్డుకోలేకపోయారు. తమదైన ఆటతీరుతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ పడగొట్టారు.
We’ll just leave this here. 😎
— Royal Challengers Bangalore (@RCBTweets) April 18, 2021
3️⃣ wins from 3️⃣! 🎯🔥#PlayBold #WeAreChallengers #IPL2021 #DareToDream #RCBvKKR pic.twitter.com/LcvP9jXvJZ