Megastar Chiranjeevi | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి లండన్‌లో తన అభిమానులను అలెర్ట్ చేశాడు. సినీరంగంలో ఆయన అందించిన సేవలకు గాను యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో ‘బ్రిడ్జ్ ఇండియా’ అనే సంస్థ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేసిన విషయం తెలిసిందే. గత నాలుగున్నర దశాబ్దాలుగా సినిమా రంగం ద్వారా కళలకు, సమాజానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఆయనకు లభించింది. అయితే చిరంజీవి లండన్ వచ్చిన విషయాన్ని వాడుకున్న కొందరూ ఆకతాయిలు మెగాస్టార్‌ని కల్పిస్తామంటూ ఫ్యాన్ మీట్ పేరుతో అభిమానుల దగ్గరినుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం కాస్త చిరు దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
నా ప్రియమైన అభిమానులకు, యూకేలో నన్ను కలవాలనే మీ అందరి ప్రేమ మరియు ఆప్యాయత నన్ను ఎంతగానో కదిలించింది. అయితే కొందరు వ్యక్తులు ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసులు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఈ ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే, వెంటనే తిరిగి వారికి ఇచ్చేయండి. దయచేసి ఇటువంటి విషయాల్లో అభిమానులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడూ, ఎక్కడా నేను ఇలాంటి చర్యలను సమర్థించనని గుర్తుంచుకోండి. మన మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతల బంధం అమూల్యమైనది. దీనిని ఎవరూ ఎలాంటి వాణిజ్య కార్యక్రమంగా మార్చలేరు. మన సంబంధాలను నిజాయితీగా, ఎటువంటి దోపిడీ లేకుండా ఉంచుకుందాం. మీ ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు! అంటూ రాసుకోచ్చాడు.