Lucky Bhaskar | లక్కీ భాస్కర్ (Lucky Bhaskar) సినిమాతో టాలీవుడ్లో హ్యాట్రిక్ అందుకున్నాడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఇప్పటికే తెలుగులో మహానటితో పాటు సీతారామం సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్నాడు ఈ హీరో. ఇప్పుడు తాజాగా లక్కీ భాస్కర్ అంటూ వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. గత ఏడాది ‘సార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటించింది.
దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం స్టాక్ మార్కెట్ నేపథ్యంలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాను తాజాగా చూసిన అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి మూవీ బాగుందంటూ ప్రశంసలు కురిపించాడు. సినిమా నచ్చడంతో దర్శకుడు వెంకీ అట్లూరిని ఏకంగా ఇంటికి పిలిపించుకుని అభినందించాడు. ఈ విషయాన్ని దర్శకుడు వెంకీ సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేశాడు. లక్కీ భాస్కర్ సినిమా చూసి అభినందించినందుకు థాంక్యూ మెగాస్టార్ చిరంజీవి సర్. మ్యాట్నీ ఐడల్, ఒకప్పుడు నేను ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు చూసిన హీరో ఇవాళ నా సినిమా చూసి నన్ను పిలిచి అభినందించడం ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. సినిమాపై మీకు ఉన్న ప్రేమ అందరికి ప్రేరణగా నిలుస్తుంది అని వెంకీ ఎమోషనల్ పోస్ట్ చేసాడు.