Megastar Chiranjeevi | తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ భరితమైన పోస్ట్ షేర్ చేశారు.
చిరంజీవి తన పోస్ట్‌లో ఎన్టీఆర్ గొప్పతనాన్ని కొనియాడుతూ.. ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం తెలుగు చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదని పేర్కొన్నారు. తెరపై అనేక వైవిధ్యమైన పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా, ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎప్పటికీ చిరస్మరణీయులు అని చిరంజీవి కొనియాడారు.
ఇదే పోస్ట్‌లో చిరంజీవి తనకు ఇటీవల దక్కిన గౌరవాన్ని కూడా ప్రస్తావించారు. “ఇటీవల నాకు ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ లభించడం ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. ఆ మహనీయుడిపై నాకు ఉన్న భక్తి, గౌరవానికి ఈ పురస్కారం మరింత విలువైన గుర్తింపుగా నా జీవితంలో నిలిచిపోతుంది. ఆ యుగపురుషుని జయంతి సందర్భంగా ఆయనను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాను” అంటూ చిరంజీవి తన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పాటు, అటు నందమూరి అభిమానులను, ఇటు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.