Chiranjeevi – Anil ravipudi | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి కొత్త సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కేరళలో జరుగుతుండగా.. కొందరు వ్యక్తులు షూటింగ్ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలారు. అయితే ఈ విషయంపై నిర్మాణ సంస్థ సీరియస్ అయ్యింది. అనధికారికంగా షూటింగ్ రికార్డు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ సందర్భంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.
మెగా 157 సినిమా సెట్స్ నుండి కొన్ని అనధికార వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయని మా దృష్టికి వచ్చింది. మా అనుమతి లేకుండా సెట్స్ నుండి కంటెంట్‌ను రికార్డు చేయవద్దని మేము కోరుతున్నాము. అలా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఇలాంటి చర్యల వల్ల మా షూటింగ్‌కి ఇబ్బంది కలిగించడమే కాకుండా, ఈ సినిమా కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న చిత్రబృందం మొత్తాన్ని బాధపెట్టినట్లే అవుతుంది. దయచేసి దీనికి సంబంధించిన ఫోటోలను ఎవరూ షేర్ చేయవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సినిమాను మేము ఎంతో ప్రేమతో రూపొందిస్తున్నాము. అభిమానులు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలని మేము కోరుతున్నాము. అంటూ చిత్రయూనిట్ రాసుకోచ్చింది.
షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. చిరంజీవి ఈ చిత్రంలో తన నిజమైన పేరు శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తమిళ లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించబోతుంది.