Chiranjeevi Industry Hit Movies | మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉత్తరాదిలో తెలుగు సినిమాలకు అంతగా గుర్తింపు లేని రోజుల్లో.. చిరంజీవి తన మూవీస్‌తో తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. ఇండియాలోనే కోటీకి పైగా రెమ్యునరేషన్ అందుకున్న మొదటి హీరోగా చిరు రికార్డు సృష్టించాడు. ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన చిరు ఎన్నో ఇండస్ట్రీ హిట్లు మరెన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు. టాలీవుడ్లో 10కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన మొదటి హీరోగా రికార్డు సృష్టించాడు. ఇక సౌత్ నుండి ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌కు ఆహ్వానించబడిన మొట్టమొదటి హీరోగా కూడా మెగాస్టార్ నిలిచాడు. సోమవారం చిరంజీవి బర్త్‌డే సందర్భంగా అటు అభిమానులు, ఇటు సినీ సెలబ్రెటీల నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
చిరంజీవి ఇప్పటివరకు 152 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. ఇక ఈ 152 సినిమాల్లో అపజయాలకంటే విజయాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏ హీరో కూడా టచ్ చేయని విధంగా ఈయన సినిమాల రికార్డులు ఉండేవి. మొదటి 5 కోట్లు, 10 కోట్లు, 30 కోట్ల షేర్‌ను వసూళ్ చేసిన హీరోగా చిరంజీవి అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. అలా ఈయన రికార్డులు క్రియేట్ చేసిన పది సినిమలేంటో చూద్ధాం.
ఖైదీ:
అప్పుడప్పుడే మీడియం హీరోగా మొదటి స్థానంలో ఉన్న చిరుకు ‘ఖైదీ’ సినిమా స్టార్ హీరోను చేసింది. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సీన్స్, చిరు గ్రెసింగ్ డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కొదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 8కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి ఇండస్ట్రీహిట్గా నిలిచింది.
పిసవాడి ప్రాణం:
చిరంజీవిని తిరుగులేని హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. కొన్ని థియేటర్లలో ఏకంగా 100రోజులు హౌజ్‌ఫుల్ బోర్డులతో ఈసినిమా ఆడింది. తెలుగు తెరపై మొట్ట మొదటి సారిగా బ్రేక్ డ్యాన్స్‌ను చిరు ఈసినిమాతో పరిచయం చేశాడు. చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ అనే పాట అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. గీతా ఆర్స్ట్ బ్యానర్‌పై అల్లూఅరవింద్ నిర్మించిన ఈ చిత్రం ఏకంగా 5 కోట్ల షేర్‌ను సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
స్వయం కృషి:
చిరంజీవి తన ఇమేజ్‌కు భిన్నంగా చెప్పులు కుట్టుకునే ఓ సాధారణ మనిషి పాత్రలో నటించి గొప్ప ప్రశంసలు దక్కించుకున్నాడు. కే. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో చిరు నటనకు నంది అవార్డు కూడా వచ్చింది.
యముడుకి మొగుడు:
ఫాంటసీ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం చిరంజీవికి కమర్షియల్‌గా భారీ విజయాన్ని అందించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పట్లో ఈ చిత్రం ఎక్కవు సెంటర్లలో 100రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది. కోటీ రూపాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఐదున్నర కోట్లను కలెక్ట్ చేసి ఇండస్ట్రీహిట్గా నిలిచింది.
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు:
చిరంజీవి-కొదండ రామిరెడ్డి కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. చాలా కాలం తర్వాత వాణిశ్రీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. చిరంజీవి, వాణిశ్రీ మధ్య వచ్చే సీన్స్‌కు థియేటర్లో ప్రేక్షకులు ఈలలు గోలలు చేశారు. 1989లో వచ్చిన ఈ చిత్రం చిరంజీవికి మరో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
కొండ వీటి దొంగ:
రాబిన్ హుడ్ తరహా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఫస్ట్ వీకెండ్లోనే ఈ చిత్రం అప్పట్లోనే 75లక్షల్ షేర్‌ను సాధించి ఆల్ టైం బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. మొదటి వారం కోటిన్నర కలెక్షన్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఫైనల్‌గా ఈ చిత్రం 5 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సూపర్‌హిట్‌గా నిలిచింది.
జగదేక వీరుడు అతిలోక సుందరి:
ఫాంటసీ అడ్వేంచర్ ఫిలింగా తెరకెక్కిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అత్యంత భారీగా దాదాపు 9కోట్ల బడ్జెట్‌తో అశ్వినీదత్ నిర్మించాడు. ఫైనల్‌గా ఈ చిత్రం 15కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
గ్యాంగ్ లీడర్:
యాక్షన్ క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా గ్యాంగ్‌లీడర్ నిలిచింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో
డబ్బింగ్ రూపంలో విడుదలై సంచలన విజయం సాధించిది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమా స్క్రీనింగ్ చేయబడింది. బప్పీ లహరీ మ్యూజీక్ అయితే వేరే లెవల్. మొదటి వారం కోటీ రూపాయల షేర్ సాధించిన ఈ చిత్రం ఫైనల్‌గా 10కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ఘరాణ మొగుడు:
రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్లో మొదటి 10కోట్ల షేర్‌ను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించాడు. పలు ఇంగ్లీష్ మ్యాగజైన్లలో ఈ చిత్రం గురించి రావడం అప్పట్లో సంచలనం అయింది. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1992 ఏప్రిల్ 9న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి రెమ్యునరేషన్ కోటీకిపైగా పెరిగింది.
ఇంద్ర:
చిరంజీవి మొదటి సారిగా ఫ్యాక్షనిస్టుగా నటించిన ఈ చిత్రం 2002లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంతో అశ్వీనిదత్- చిరంజీవి కాంబోలో హ్యట్రిక్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దాదాపు 9కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారంలోనే ఏకంగా 8 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఫైనల్‌గా 40కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. విజయవాడలో సింగిల్ థియేటర్లో కోటీ రూపాయలు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఎక్కువ కేంద్రంలో 50రోజులు ఆడిన సినిమాగా రికార్డు సృష్టించింది.