Mega Fans | మరో రెండు రోజుల్లో ఏప్రిల్‌కి గుడ్ బై చెప్పి మేకి స్వాగతం పలకబోతున్నాం. ఏప్రిల్ నెలలో సినిమాల సందడి పెద్దగా లేకపోవడంతో కనీసం మేలో అయిన సినీ ప్రియులని ఆనందింపజేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మిగతా ఫ్యాన్స్ సంగతేమో కాని మెగా ఫ్యాన్స్‌కి మాత్రం మే నెల రెట్టింపు ఆనందం కలిగించనుంది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి తన ఐకానిక్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంతో అలరించబోతున్నాడు. మే 9న ఈ చిత్రం టూడీ, త్రీడీ ఫార్మాట్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీరిలీజ్ జరుపుకుంటుంది. చిరంజీవి, శ్రీదేవిల నటన, కె.రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, ఇళయరాజా సంగీతం, నిర్మాత అశ్వనీదత్ భారీ నిర్మాణ విలువలు ఈ తరం ప్రేక్షకులని కూడా ఎంతో మెస్మరైజ్ చేస్తాయి.
ఇక మే 9నే మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసే మరో వార్త బయటకు వచ్చింది. ఆ రోజు లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా లాంచ్ కానుంది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఇది మెగా ఫ్యాన్స్‌కి చాలా మెమోరబుల్ మూమెంట్ అని చెప్పవచ్చు. మేడమ్ టుస్సాడ్స్‌లో విగ్రహం పెట్టడం అనేది ఆశామాశీ కాదు. కొందరు సినీ సెలబ్రిటీలకే ఆ అవకాశం దక్కింది. ఇప్పుడు ఆ లిస్ట్ లో రామ్ చరణ్ కూడా చేరడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగే ఆర్ఆర్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా పెర్ఫార్మెన్స్ కు కూడా చరణ్ హాజరు కాబోతున్నాడు.
మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరిగి సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ ను మే లోనే పూర్తి చేసి డబ్బింగ్ ను కూడా చెప్పడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇది పూర్తైన వెంటనే మే నెలలోనే ఓజి సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టాలని చూస్తున్నాడట పవన్. పవన్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఓజీ చిత్రం కోసం వెయిట్ చేస్తుండగా, ఇప్పుడు ఓజీ సినిమాని మేలో మొదలు పెట్టి వీలైనంత త్వరగా మూవీని పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మొత్తానికి మేలో ఈ మూడు స్పెషల్స్ మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.