Mega Brothers | చిరంజీవి, పవన్ కళ్యాణ్ ..వరుస చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. మెగాస్టార్ రాజకీయాలకు దూరమయ్యాక కెరీర్ మీద పూర్తి ఫోకస్ పెట్టారు. మరోవైపు రాజకీయాల నుంచి ఏమాత్రం విరామం దొరికినా సినిమా షెడ్యూల్ ప్రారంభిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇద్దరికీ నాలుగైదు ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. ఇవి సెట్స్ మీద ఉండగానే.. మరికొన్ని ప్రాజెక్ట్స్ కోసం సంప్రదింపులు చేస్తున్నారు. ఇంత వేగం వీళ్లిద్దరి కెరీర్లో గతంలో ఎప్పుడూ లేదు. పవన్ మొదటి నుంచీ చాలా ఎంపికగా సినిమాలు చేస్తూ వస్తే, మెగాస్టార్ అయ్యాక కూడా చిరంజీవి తన సినిమాకెప్పుడూ ఇంత భారీ క్యూ పెట్టుకోలేదు. పెంచిన వేగంలో ఈ ఇద్దరు మెగా బ్రదర్స్‌లో ఒక కామన్ క్వాలిటీ కనిపిస్తున్నది.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రీమేక్స్ను బాగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న సినిమాల్లో భోళా శంకర్, గాఢ్ ఫాదర్ రెండు చిత్రాలు రీమేక్‌లే. భోళా శంకర్ కథను తమిళ హీరో అజిత్ వేదాళం నుంచి ఇన్ స్పైర్ అవ్వగా.. గాడ్ ఫాదర్ సినిమా మలయాళ హిట్ సినిమా లూసీఫర్ రీమేక్. ఇక పవన్ కళ్యాణ్ రీసెంట్ హిట్ భీమ్లా నాయక్ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌గా తెరకెక్కింది. మెగా బ్రదర్స్ రీమేక్స్ పర్వం ఇంకా ఆగిపోలేదని తెలుస్తున్నది.
మలయాళ హిట్ ఫిల్మ్ బ్రో డాడీ రీమేక్ పై మెగాస్టార్ మనసు పడ్డారట. ఈ సినిమా వెంకటేష్, రానా కాంబినేషన్లో తెరకెక్కుతుందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ వెంకీ, రానా ఇద్దరూ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగానే ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవికి బాగా నచ్చిందట. అందుకే ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకునే పనిలో పడ్డాడట. ఇందులో చిరంజీవికి కొడుకుగా ఎవరు నటిస్తారనేది మాత్రం తెలియదు. ఇక పవన్ కళ్యాణ్ కూడా మరో రీమేక్‌లో నటించబోతున్నాడు. తమిళ సినిమా వినోదయ సితం తెలుగు వెర్షన్లో పవన్ కనిపించనున్నారు. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా..త్రివిక్రమ్ కథనం, మాటలు అందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ పవన్ తో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.