Mega 157 | మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు 2025 పుట్టినరోజు (ఆగస్ట్ 22) మరపురాని వేడుకగా మారబోతోంది. ఫ్యాన్స్ ఆశించినట్లుగానే క్రేజీ అప్డేట్స్ వరుసబెట్టి వచ్చేస్తున్నాయి. మెగా అభిమానులు మాత్రమే కాదు, సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా టైటిల్, గ్లింప్స్ ఎట్టకేలకి విడుదలైంది.చిరంజీవి -అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. “మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ కొద్ది రోజులుగా ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుండగా, అదే టైటిల్‌ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ టైటిల్‌ను విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో అందించడం స్పెషల్ హైలైట్.
చిరంజీవి, వెంకటేష్ మధ్య మంచి స్నేహబంధం ఉండటంతో, ఈ ప్రాజెక్ట్‌లో వెంకీ కీలక పాత్రలో కనిపించనున్నారు. గ్లింప్స్ లో చిరంజీవి సూట్ ధరించి సిగరెట్ తాగుకుంటూ అలా వస్తుండడం చూసి ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. చివరిలో గుర్రం పట్టుకొని నడుచుకుంటూ వచ్చే షాట్ కూడా అదిరిపోయింది. ఇక మన శంకర వర ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అంటూ వెంకీ చెప్పడం మరో హైలైట్ అయింది. ఈ సినిమా 2026 సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతోంది. గతంలో అనిల్ – వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 వంటి హిట్ కామెడీ ఎంటర్టైనర్లు సంక్రాంతికి రిలీజై ఘన విజయం సాధించిన నేపథ్యం చూస్తే, ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ కావొచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి.
చిరంజీవి నటిస్తున్న ఫ్యాంటసీ డ్రామా ‘విశ్వంభర’ నుంచి గ్లింప్స్ ఇప్పటికే రిలీజ్ కాగా, ఇది అలరించింది. ఈ చిత్రం 2026 వేసవిలో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఇక ఈ రోజు సాయంత్రం చిరంజీవి – బాబీ కొల్లి కాంబోలో మరో కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఉంటుంది. ‘వాల్తేరు వీరయ్య’ తరహాలోనే మాస్ మజా ఉన్న సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.