Meenakshi Seshadri | 1990వ దశకంలో దేశంలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలిగింది మీనాక్షి శేషాద్రి. ఒకదశలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్‌గానూ నిలిచింది. తాజాగా ఓ ఆన్లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా జీవితాన్ని మలుపు తిప్పిన ఓ సంఘటన గురించి అభిమానులతో పంచుకున్నది. 1985లో వచ్చిన ‘మేరీ జంగ్’ సినిమా.. మీనాక్షి సినీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మీనాక్షి వేసింది చిన్నపాత్రే అయినా.. నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తనలో బహుముఖ ప్రతిభను వెలికితీసింది. అయితే, ఈ చిత్ర దర్శకుడు సుభాష్ ఘాయ్‌తో తనకు మంచి అనుబంధం ఉండేదనీ, ఒక చిన్న అపార్థం.. తమ మధ్య వృత్తిపరమైన సంబంధాన్ని తీవ్రంగా దెబ్బతీసిందనీ చెప్పుకొచ్చింది.
“మేరీ జంగ్ చిత్రంలో నేను పోషించింది చిన్నపాత్రే అయినా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అంత ప్రాధాన్యత లేకపోయినా.. దర్శకుడు సుభాష్ నన్ను బాగా హైలైట్ చేశారు. సినిమాల్లో చిన్నపాత్రలే కీరోల్ ప్లే చేస్తాయనీ, ప్రేక్షకులకు దగ్గర చేస్తాయనీ ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. నా విషయంలోనూ అదే జరిగింది!” అంటూ నాటి విషయాలను పంచుకున్నది మీనాక్షి. నిజానికి దర్శకుడు సుభాష్ ఘాయ్.. తన చిత్రాల్లో మీనాక్షికి పెద్దపెద్ద పాత్రలు ఇవ్వాలని అనుకునేవాడట. కానీ, తను ఆయన అంచనాలను అందుకోలేకపోయిందట.
అదే విషయం చెబుతూ.. “అప్పటికి నేను చాలా చిన్నదాన్ని. ఇండస్ట్రీలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు. అదే సమయంలో నాకూ సుభాష్కూ మధ్య చిన్నచిన్న మనస్పర్థలు ఏర్పడ్డాయి. మా ఇద్దరి మధ్యా వృత్తిపరమైన సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో ఆయన నన్ను పక్కనపెట్టేశారు. వేరేవాళ్లతో మంచి హిట్స్ కొట్టారు కూడా! అప్పటినుంచి నా కెరీర్ ఎన్నో ఒడుదొడుకులకు గురైంది!” అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి శేషాద్రి. ‘దామిని’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. ‘బ్రహ్మశ్రీ విశ్వామిత్ర’తో టాలీవుడ్‌ను పలకరించింది. చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఆపద్బాంధవుడు’తో తెలుగువారికి మరింత దగ్గరైంది.