NC24 | తండేల్తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ నటుడు నాగచైతన్య ప్రస్తుతం విరుపాక్ష దర్శకుడితో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ‘NC24’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఒక మైథలాజికల్ థ్రిల్లర్ లేదా ట్రెజర్ హంట్ థీమ్‌తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య ట్రెజర్ హంటర్ (నిధి వేటగాడు) పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరి ఎంపికైనట్లు తెలుస్తుంది. మీనాక్షి చౌదరి ఇందులో ఆర్కియాలజిస్ట్ పాత్రలో నటించబోతుంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో 5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన ఒక గుహ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్ నిర్మాణానికి 50 రోజులు పట్టిందని, కళా దర్శకుడు శ్రీనాగేంద్ర దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని చిత్ర బృందం తెలిపింది. ఈ గుహలో తీస్తున్న సన్నివేశాలు సినిమాలో 20 నిమిషాలకు పైగా ఉంటాయని దర్శకుడు కార్తీక్ వర్మ దండు వెల్లడించారు.
‘తండేల్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాగచైతన్య నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మిస్టిక్ థ్రిల్లర్ జానర్లో చైతన్యకు ఇది తొలి సినిమా కావడం, మీనాక్షి చౌదరితో ఆయన కాంబినేషన్ ఫ్రెష్‌గా ఉండటంతో ప్రేక్షకుల ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదే విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.