NC 24 | అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న యంగ్ హీరో నాగచైతన్య వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కథలు, విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న చైతూ, ఈసారి పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు. ‘మజిలీ’, ‘లవ్ స్టోరీ’, ‘కస్టడీ’, ‘తండేల్’ తర్వాత ఆయన మళ్లీ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో అడుగుపెట్టారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌కి తాత్కాలికంగా ‘NC24’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ సమర్పణలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘సంక్రాంతికి వస్తున్నాం’తో ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ అందుకున్న అందాల భామ మీనాక్షి చౌదరి, నాగచైతన్య సరసన నటిస్తోంది. తాజాగా విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టర్లో మీనాక్షి ‘దక్ష’ అనే పురావస్తు శాస్త్రవేత్తగా కనిపిస్తోంది. చీకటి గుహలో ఏదో రహస్యాన్ని వెతికే ఆర్కియాలజిస్ట్ పాత్రలో ఆమె కనిపించిన తీరు సినిమా పట్ల ఆసక్తి మరింత పెంచింది. పోస్టర్లో ఆమె ముఖంలోని సీరియస్ ఎక్స్ప్రెషన్, గుహలోని మిస్టీరియస్ లైటింగ్ కలసి సినిమాకి ఒక థ్రిల్లింగ్ వైబ్ ఇచ్చాయి. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్‌లో కనిపించిన మీనాక్షి, ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నారు.
సినిమా టెక్నికల్ టీమ్ కూడా చాలా బలంగా ఉందని సమాచారం. “కాంతారా”, “సప్తసాగరాలు దాటి” వంటి సినిమాలకు సంగీతం అందించిన అజనీష్ బి. లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు సస్పెన్స్, థ్రిల్, ఎమోషన్ మేళవింపును ఇవ్వనుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక “లాపాటా లేడీస్” ఫేమ్ నటుడు స్పార్ష్ శ్రీవాస్తవ ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన పాత్ర కూడా కథలో కీలక మలుపుగా ఉండబోతుందట. ఈ చిత్రంలో నాగచైతన్య ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. యాక్షన్, మిస్టరీ, ఎమోషన్ కలగలిపిన థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కుతోందని దర్శకుడు కార్తీక్ దండు తెలిపారు. మొదటి షెడ్యూల్ ఇప్పటికే హైదరాబాద్‌లో పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. సుకుమార్ సమర్పణలో, బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్లో, నాగచైతన్య–మీనాక్షి చౌదరి కాంబినేషన్లో వస్తున్న ఈ థ్రిల్లర్‌పై భారీ బజ్ నెలకొంది. ఫస్ట్ లుక్‌తోనే ఆసక్తిని రేపిన “NC24” నుంచి త్వరలోనే టైటిల్, టీజర్ అప్డేట్ రానుంది.