Meenakshi Chaudhary | వచ్చిన ప్రతీ అవకాశాన్ని అంగీకరించి వృత్తిపరంగా బిజీ కావడం తనకు ఇష్టంలేదని, మనసుకు నచ్చిన కథలనే ఎంచుకుంటున్నానని చెప్పింది యువ కథానాయిక మీనాక్షి చౌదరి. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ అత్యుత్తమ ప్రతిభను కనబరచడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో పలు భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మహేష్‌బాబుతో ‘గుంటూరు కారం’ సినిమాతో పాటు వరుణ్‌తేజ్, విశ్వక్సేన్ చిత్రాల్లో కూడా నాయికగా మీనాక్షి చౌదరి ఎంపికైంది.
కెరీర్‌పరంగా తన ప్రాధాన్యతల గురించి ఈ భామ మాట్లాడుతూ ‘తక్కువ సినిమాలు చేసినా.. అవి కెరీర్లో గుర్తుండిపోవాలన్నది నా అభిమతం. అందుకే కథాంశాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నా. తెలుగు ప్రేక్షకులు నా ప్రతిభను గుర్తిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొంది. సినిమాల్లో ముద్దు దృశ్యాల్లో నటించడంపై స్పందిస్తూ ‘కళాత్మకంగా తీసే ముద్దు సన్నివేశాల్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ సన్నివేశం కథలో భాగంగా ఉంటేనే నటిస్తాను. కేవలం ముద్దు కోసమే క్రియేట్ చేసే సీన్స్‌లో మాత్రం అస్సలు నటించను. అలాగే నేను అందాల ప్రదర్శనకు కూడా చాలా దూరంగా ఉంటాను. ఆ కారణంగానే ఎన్నో సినిమాల్లో అవకాశాలను తిరస్కరించాను’ అని మీనాక్షి చౌదరి చెప్పింది.